రేపే ఉద్యోగంలో చేరిపోండి : ఆర్టీసీ కార్మికులకు సీఎం తీపి కబురు

రేపే ఉద్యోగంలో చేరిపోండి : ఆర్టీసీ కార్మికులకు సీఎం తీపి కబురు

  28 Nov 2019   , ,

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు చెప్పారు సీఎం కేసీఆర్. సమ్మె విరమించిన కార్మికులు రేపు(శుక్రవారం) విధులకు హాజరుకావొచ్చని ప్రకటించారు. “ఆర్టీసీ సమస్యకు ముగింపు తేవాలని కేబినెట్‌లో చర్చించాం. యూనియన్ల మాటలు విని ఆర్టీసీ కార్మికులు పెడదారి పడుతున్నారు. చెడిపోతున్నారు. సంస్థను దెబ్బ తీస్తున్నారు. లేనిపోని టెన్షన్స్ పడుతున్నారు. ఈ పరిస్థితికి పూర్తి బాధ్యత ఆర్టీసీ యూనియన్లదే బాధ్యత” అని అన్నారు సీఎం.

“ఆర్టీసీ కోసం ప్రభుత్వం తరఫున వెంటనే రూ.100 కోట్లు విడుదల చేస్తాం. కానీ.. ఆర్టీసీని బతికించుకోవడానికి చార్జీలు పెంచక తప్పదు. కిలోమీటర్‌కు 20 పైసలు చొప్పును పెంచితే ఆర్టీసీకి ఏడాదికి రూ.750 కోట్లు ఆదాయం వస్తుంది. అలా ఛార్జీలు పెంచుకునే వెసులుబాటు ఆర్టీసీ సంస్థకు కల్పిస్తున్నాం. దీని వల్ల సంస్థకు కొంత నష్టం పూడుతుంది. చార్జీల పెంపు వచ్చే సోమవారం నుంచి అమలవుతుంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీ చార్జీలు పెంచలేదు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి” అన్నారు సీఎం కేసీఆర్.

‘కొందరు ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకుంటే.. వారిలో నలుగురైదుగురికి కలిపి ఓ రూట్ పర్మిట్ ఇవ్వాలని అనుకున్నా. నేను చెప్పినట్టు వింటే మిమ్మల్ని సింగరేణి తరహాలో తీసుకెళ్తాం. యూనియన్లు లేకపోతే ఎలా అనే అనుమానం వద్దు. డిపోకి ఇద్దరు చొప్పున వర్కర్స్ వెల్ఫేర్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తాం. దాని బాధ్యతలు మంత్రికి అప్పగిస్తాం. ప్రతినెలా ఆ కౌన్సిల్ ఓ సమావేశం నిర్వహిస్తుంది. యాజమాన్యం వేధించకుండా ఏర్పాట్లు చేస్తాం. యూనియన్ల మాట వింటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే.’ అని కేసీఆర్ ప్రకటించారు.