Post Office Scheme : బ్యాంకు FDల కంటే ఎక్కువ వడ్డీ.. అదిరిపోయే పోస్ట్ ఆఫీస్ ప్లాన్.. నెలకు రూ. 17 వేలు!

post office

Post Office Scheme :  సాధారణంగా ప్రతి ఒక్కరికీ తాము సంపాదించే డబ్బులో కొంత మొత్తాన్ని పొదుపు చేయాలనే ఆలోచన ఉంటుంది. అయితే తాము దాచుకున్న సొమ్ము సురక్షితంగా ఉండటంతో పాటు, మంచి లాభాలను అందించే పథకాల కోసం చాలామంది వెతుకుతుంటారు. అటువంటి వారికి పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యతగా ఉంటాయి. ప్రభుత్వ మద్దతు, గ్యారెంటీ రిటర్న్స్ ఉండటమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా రిటైర్ అయిన తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునే వారి కోసం పోస్ట్ ఆఫీస్ ‘సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్’ (SCSS) ఒక వరంలా పనిచేస్తోంది.

ప్రస్తుతం ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా 8.2 శాతం వడ్డీని అందిస్తోంది. ఇది చాలా బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) కంటే మెరుగ్గా ఉండటం విశేషం. ఈ పథకంలో మీరు రూ. 1,000 నుండి గరిష్టంగా రూ. 30 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. దీని కాలపరిమితి 5 ఏళ్లు. పెట్టుబడి పెట్టిన వెంటనే, మీకు క్రమ పద్ధతిలో వడ్డీ రూపంలో ఆదాయం రావడం మొదలవుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా పొందే అవకాశం ఉండటం మరో ప్లస్ పాయింట్.

ఈ పథకంలో చేరడానికి వయస్సు పరిమితులు కూడా వెసులుబాటుగా ఉన్నాయి. సాధారణంగా 60 ఏళ్లు నిండిన వారు ఇందులో చేరవచ్చు. అయితే VRS (స్వచ్ఛంద పదవీ విరమణ) తీసుకున్న వారు 55 ఏళ్ల నుండి 60 ఏళ్ల లోపు ఉన్నా కూడా ఈ ఖాతాను తెరవవచ్చు. ఇక రక్షణ రంగంలో పనిచేసి పదవీ విరమణ చేసిన వారైతే 50 ఏళ్లు దాటిన వెంటనే ఈ పథకంలో పెట్టుబడి పెట్టే వీలుంది. ఈ పథకంలోని ప్రత్యేకత ఏమిటంటే, పెట్టుబడిదారులకు ప్రతి మూడు నెలలకొకసారి వడ్డీని చెల్లిస్తారు. అంటే మీకు కావాల్సిన ఖర్చుల కోసం ప్రతి క్వార్టర్‌లో చేతికి నగదు అందుతుంది.

నెలకు రూ. 17,000 పైగా ఆదాయం ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఒక వ్యక్తి లేదా దంపతులు కలిసి ఈ పథకం కింద రూ. 25 లక్షలు పెట్టుబడిగా పెడితే, ప్రస్తుతం ఉన్న 8.2 శాతం వడ్డీ రేటు ప్రకారం వారికి మూడు నెలలకోసారి దాదాపు రూ. 51,250 వడ్డీ లభిస్తుంది. దీనిని నెలవారీగా లెక్కగడితే సుమారు రూ. 17,000 కంటే ఎక్కువే వస్తుంది. ఇలా ఐదేళ్ల పాటు నిరంతరంగా ఆదాయం పొందవచ్చు. ఐదేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత మీ అసలు మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు లేదా మరో మూడేళ్ల పాటు ఈ పథకాన్ని పొడిగించుకోవచ్చు. ఒకవేళ గడువు తీరకముందే డబ్బు అవసరమై ఖాతా మూసివేస్తే నిబంధనల ప్రకారం కొంత జరిమానా ఉంటుంది. ఒకవేళ ఖాతాదారుడు మరణిస్తే, ఆ మొత్తం సొమ్ము నామినీకి అందుతుంది.

మీరు కూడా రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా గడపాలనుకుంటే, మీకు దగ్గరలోని పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లి ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ప్రభుత్వ భరోసా ఉండటంతో మీ పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుంది.