నాలుగేళ్ల క్రితం కివీస్ కొట్టిన దెబ్బ.. అదే న్యూజిలాండ్‎పై ప్రతీకారం

2015 ఫిబ్రవరి 20. ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో ఇంగ్లాండ్ తలపడిన రోజు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 33.2 ఓవర్లలో 123 రన్స్ కు ఆలౌటైంది. 25 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 103 పరుగులతో ఉన్న ఇంగ్లాండ్.. చివరి 7 వికెట్లను 20 పరుగుల తేడాతో కోల్పోయింది. 2019 వరల్డ్ కప్ ఫైనల్లో సూపర్ ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ నాటి మ్యాచ్ లో విధ్వంసం సృష్టించాడు. 33 పరుగులిచ్చి 7 వికెట్లు తీసి మోర్గాన్ సేన పతనం శాసించాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ మెక్ కల్లమ్ భీకర ఇన్నింగ్స్ తో  12 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ చేసింది. వరల్డ్ కప్ హిస్టరీలో ఇంగ్లాండ్ కు అది అత్యంత ఘోర ఓటమి. ఆ ఓటమి తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ గా వ్యవహరించిన మోర్గాన్ ఏమన్నాడంటే… ‘‘క్రికెట్ లో మమ్మల్ని అత్యంత అథమ స్థితికి చేర్చిన రోజది. హ్యుమిలియేటింగ్, మేం పాతాళంలో పడిపోయినట్లు అనిపించింది’’ అని. కివీస్ చేతిలో ఓటమి తర్వాత ఇంగ్లాండ్ కోలుకోలేకపోయింది. ఆఖరికి బంగ్లాదేశ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

కాలం గిర్రున తిరిగింది. నాలుగేళ్లలో ఇంగ్లాండ్ రాటుదేలింది. ఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడించి సగర్వంగా కప్పు ఎగరేసుకుపోయింది. నాడు న్యూజిలాండ్ నేర్పిన పాఠమే తమనీ స్థితికి చేర్చిందంటాడు మోర్గాన్. పతనం నుంచి ఫినీక్స్ లేచి రావడమెలాగో నేర్పారని ‘‘మెన్ ఇన్ బ్లాక్స్’’కు థ్యాంక్స్ చెప్తున్నాడు. ట్విస్ట్ ఏంటంటే నాలుగేళ్ల క్రితం లీగ్ స్టేజ్ దాటకుండానే టోర్నీ నుంచి ఔటైన ఇంగ్లాండ్ టీంకు కెప్టెన్ గా వ్యవహరించింది ఇయాన్ మోర్గాన్. ఇపుడు అదే ఇంగ్లాండ్ కు కప్పునందించిందీ మోర్గాన్ కెప్టెన్సీలోనే. వండర్ కదా.

LEAVE A REPLY