Investment : డబ్బు కట్టేది 15 ఏళ్లే.. కానీ వడ్డీ మాత్రం 21 ఏళ్ల వరకు!.. మీ కూతురి చేతికి లక్షలు!

investment

Investment : ప్రతి తల్లిదండ్రులు తమ కూతురి చదువు, పెళ్లి గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. ఆడపిల్లల ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే ప్లాన్ అమలు చేస్తోంది. అదే సుకన్య సమృద్ధి యోజన. ఎటువంటి రిస్క్ లేకుండా మీ అమ్మాయి భవిష్యత్తును ఆర్థికంగా భద్రం చేసేందుకు ఇది ఒక గొప్ప అవకాశం.

ఆడపిల్లల ఉన్నత చదువులు, పెళ్లి ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు కేంద్రం 2015లో ఈ స్కీమ్ తీసుకొచ్చింది. 10 ఏళ్లలోపు వయసున్న అమ్మాయి పేరు మీద కేవలం రూ. 250 చెల్లించి దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ లేదా ప్రభుత్వ బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేయడానికి అమ్మాయి బర్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల ఐడీ ప్రూఫ్ (ఆధార్, పాన్) ఉంటే సరిపోతుంది.

ప్రస్తుతం ఈ పథకానికి ఏడాదికి 8.2 శాతం వడ్డీ వస్తోంది. ఇది సాధారణ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే చాలా ఎక్కువ. ఉదాహరణకు, మీరు నెలకు కేవలం రూ.1,000 (ఏడాదికి ₹12,000) డిపాజిట్ చేస్తూ వెళ్తే.. 15 ఏళ్లలో మీరు కట్టే అసలు రూ.1,80,000 అవుతుంది. కానీ దీనికి వడ్డీ రూపంలోనే రూ.3,74,206 వస్తుంది. అమ్మాయికి 21 ఏళ్లు వచ్చేసరికి మెచ్యూరిటీ పూర్తయి.. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.5,54,206 చేతికి అందుతాయి.

ఈ అకౌంట్ మెచ్యూరిటీకి 21 ఏళ్లు పట్టినప్పటికీ, మీరు కేవలం 15 ఏళ్ల పాటు డబ్బులు కడితే సరిపోతుంది. మీరు డబ్బులు కట్టడం ఆపినా, అమ్మాయికి 21 ఏళ్లు వచ్చే వరకు ఆ మొత్తానికి వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇందులో మీరు పెట్టే పెట్టుబడి, వచ్చే వడ్డీ, చివరగా చేతికి అందే మెచ్యూరిటీ అమౌంట్ మీద ఒక్క రూపాయి కూడా ఆదాయపు పన్ను (Income Tax) కట్టక్కర్లేదు. ఇది పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ పథకం.

మధ్యలో డబ్బులు తీసుకోవచ్చా?

అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత చదువులు లేదా పెళ్లి ఖర్చుల కోసం అప్పటి వరకు జమ అయిన మొత్తంలో 50 శాతాన్ని వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ పథకంలో ఏడాదికి కనిష్టంగా రూ.250 నుండి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పొదుపు చేయవచ్చు. మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక వరమని చెప్పవచ్చు.