Green Card Holders : అమెరికాలో స్థిరపడి సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు (Green Card Holders)యూఎస్ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఇకపై గ్రీన్ కార్డ్ హోల్డర్లు (Lawful Permanent Residents) అమెరికా ప్రభుత్వ మద్దతుతో ఇచ్చే స్మాల్ బిజినెస్ లోన్స్ (SBA Loans) పొందడానికి అనర్హులని యూఎస్ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (SBA) ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు 2026, మార్చి 1 నుండి అమలులోకి రానున్నాయి.
ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. అమెరికాలో శాశ్వత నివాసం ఉండే విదేశీయులకు (Green Card Holders) కూడా కొన్ని షరతులతో వ్యాపార రుణాలు ఇచ్చేవారు. కానీ, ఫిబ్రవరి 2న జారీ చేసిన కొత్త పాలసీ ప్రకారం.. ఇకపై ఆ వ్యాపారంలో 100 శాతం వాటా కేవలం అమెరికా పౌరులకు మాత్రమే ఉండాలి. ఒక్క శాతం వాటా గ్రీన్ కార్డ్ హోల్డర్ దగ్గర ఉన్నా, ఆ కంపెనీకి ప్రభుత్వ రుణాలు అందవు.
అమెరికా పౌరులకు, దేశీయ ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న సడలింపులను రద్దు చేస్తూ, నేరుగా లేదా పరోక్షంగా వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్లను ఈ రుణాల నుండి దూరం పెట్టింది.
Major change hitting the SBA March 1st:
• All owners must be U.S. citizens with a primary residence in the U.S.
• The 5% ownership exception for non-U.S. residents is gone.
• Green card holders/Permanent residents no longer qualify. pic.twitter.com/7nHnTA78iA— Sterling Birdsong (@SterlingSBA) February 3, 2026
ఎవరిపై ఎఫెక్ట్ అంటే
అమెరికాలో చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లు నడుపుతున్న లక్షలాది మంది భారతీయులపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. మార్చి 1 తర్వాత కొత్తగా లోన్ అప్లికేషన్ పెట్టుకునే వారు ఈ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ వ్యాపారంలో గ్రీన్ కార్డ్ హోల్డర్లు భాగస్వాములుగా ఉంటే, లోన్ పొందడానికి మీరు మీ ఓనర్‌షిప్ స్ట్రక్చర్‌ను మార్చుకోవాల్సి రావచ్చు. మరిన్ని వివరాల కోసం స్థానిక SBA ఫీల్డ్ ఆఫీసులను సంప్రదించాలని అధికారులు సూచించారు.
