Paneer Side Effects : ‘పనీర్’ పేరు వినగానే నోరూరిపోతుంది. ప్రోటీన్లు, కాల్షియం పుష్కలంగా ఉండే పనీర్.. ఎముకల ఆరోగ్యానికి, కండరాల పెరుగుదలకు ఎంతో మేలు చేస్తుంది. అందుకే శాఖాహారులు పనీర్‌ను తమ ఫేవరెట్ ఫుడ్‌గా భావిస్తారు. అయితే, ఏదైనా అతిగా తింటే అమృతం కూడా విషమే అన్నట్లు.. పనీర్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పనీర్ పాలు లేదా పాల పదార్థాల నుండి తయారవుతుంది కాబట్టి, ‘లాక్టోస్ ఇంటాలరెన్స్’ (పాలు పడని వారు) సమస్య ఉన్నవారు పనీర్ తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపునొప్పి లేదా విరేచనాలు వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా పనీర్‌ను ఉడికించకుండా పచ్చిగా తింటే జీర్ణ సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.
పనీర్‌లో ప్రోటీన్లు ఎంత ఎక్కువగా ఉంటాయో, క్యాలరీలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. శారీరక శ్రమ తక్కువగా ఉండి, పనీర్ ఎక్కువగా తింటే బరువు పెరగడం ఖాయం. కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారు పనీర్ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించడం మంచిది. అలాగే, ఇందులో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు. బయట దొరికే పనీర్‌లో నిల్వ ఉండటానికి ఉప్పు (సోడియం) ఎక్కువగా కలుపుతారు, ఇది రక్తపోటు (బిపి) పెరగడానికి కారణం అవుతుంది.
చాలామంది ప్రోటీన్ కోసం కేవలం పనీర్‌పైనే ఆధారపడతారు. దీనివల్ల కడుపు నిండిన భావన కలిగి ఇతర పోషకాలున్న ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. ఫలితంగా శరీరానికి అందాల్సిన పీచు పదార్థం (ఫైబర్), విటమిన్లు, ఖనిజ లవణాల లోపం ఏర్పడే ప్రమాదం ఉంది. మార్కెట్లో దొరికే కొన్ని రకాల పనీర్లలో స్టార్చ్, కల్తీ నూనెలు కలిపే అవకాశం ఉంది. ఇవి వాంతులు, ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీసి అంతర్గత అవయవాలను దెబ్బతీస్తాయి. అందుకే ప్యాక్ చేసిన పనీర్ కొనేటప్పుడు నాణ్యతను తనిఖీ చేయడం అవసరం.
పనీర్‌లో కార్బోహైడ్రేట్లు తక్కువే అయినా, దాన్ని అధిక కొవ్వు ఉన్న ఇతర పదార్థాలతో కలిపి తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పనీర్‌ను ఏ ఆహారంతో కలిపి తీసుకుంటున్నారనేది ముఖ్యం.
