హుజూర్ నగర్ రిజల్స్ : కాంగ్రెస్ కంచుకోటలో రికార్డ్ బ్రేక్ చేసిన సైది రెడ్డి…..

హుజూర్ నగర్ రిజల్స్ : కాంగ్రెస్ కంచుకోటలో రికార్డ్ బ్రేక్ చేసిన సైది రెడ్డి…..

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్‌ కంచుకోటలో గులాబీ జెండా రెపరెపలాడింది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి 43 వేల 284 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతి ఉత్తమ్‌రెడ్డిపై రికార్డు విజయం సాధించారు. హుజూర్ నగర్ చరిత్రలోనే అత్యధిక మెజారిటీ సాధించి…పాత రికార్డులను పటాపంచలు చేశారు సైది రెడ్డి. పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డా, కాంగ్రెస్ కంచుకోట అయిన హుజూర్ నగర్ లో సైది రెడ్డి హవాను చాటారు. పాత రికార్డు 29 వేల ఓట్ల మెజారిటీని 15వ రౌండ్ లో బ్రేక్ చేశారు. హుజూర్ నగర్ చరిత్రలోనే ఇంత అత్యధిక రికార్డు రావడం ఇదే మొదటి సారి.

సైది రెడ్డి పొలిటికల్ లైఫ్ :

ఫారిన్ కంట్రీస్ లో ఐటీ ఉద్యోగం చేసిన సైది రెడ్డి…2005లో  కేసీఆర్ స్పూర్తితో తెలంగాణ ఉద్యమం పట్ల ఆకర్షితులైన… జగదీష్ రెడ్డి నాయకత్వంలో టీఆర్ఎస్‌లో పని చేశారు. 2017 సంవత్సరంలో సీఎం కేసీఆర్ సూచన మేరకు హుజూర్ నగర్ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన సైదిరెడ్డి… 2018 ఎన్నికల్లో హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఉత్తమ్‌ను దాదాపు ఓడించినంత పని చేశారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ నియోజకవర్గంలో ప్రజలకు, టీఆర్ఎస్ శ్రేణులకు అందుబాటులో ఉంటూ వచ్చిన సైదిరెడ్డి… స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి కృషి చేశారు. అలా నియోజకవర్గంలో తన నెట్‌వర్క్‌ను బాగా పెంచుకున్నారు. ఎంపీగా గెలిచిన ఉత్తమ్ హుజూర్ నగర్ స్థానానికి రాజీనామా చేయడంతో… అప్పటి నుంచే ఈ సీటుపై ఫోకస్ పెంచారు సైదిరెడ్డి. టీఆర్ఎస్ నేతల సహకారం కూడా లభించడంతో ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

బీజేపీ, టీడీపీ, తీన్మార్ మల్లన్న డిపాజిట్లు గల్లంతు

ఇదిలా ఉంటే… అటు కాంగ్రెస్, టీఆర్ఎస్ ఓట్లు చీలుస్తాయనుకున్న టీడీపీ, బీజేపీ, కొంతమంది ఇండిపెండెట్ల ప్రభావం ఈ ఎన్నికల్లో ఏమాత్రం కనిపించలేదనే చెప్పాలి. ప్రధాన పార్టీలైన బీజేపీ, టీడీపీలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్)లాంటి ఇండిపెండెంట్లకు కనీసం వెయ్యి లోపు కూడా ఓట్లు పోలవ్వలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *