విజయారెడ్డి సజీవదహనం : బయటకొస్తున్న సంచలన నిజాలు

అబ్దుల్లాపూర్ మేట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. తీవ్ర చర్చకు దారితీసిందా ఘటన. అన్నదాతల అరిఘోసలు, రెవిన్యూ అధికారుల అవినీతి పర్వం చర్చకొచ్చింది. ఓ సాధారణ రైతు ఎమ్మార్వోను పట్టపగలే అదీ తహశీల్దార్ కార్యాలయంలోనే పెట్రోల్ పోసి తగలబెట్టేంత ప్రకోపానికి ఎలా దారితీసిందన్న చర్చ జరుగుతోంది. అయితే విజయారెడ్డి హత్య కేసులో తెరవెనుక కోణాలు బయటకొస్తున్నాయి. బాచారంలోని 85 నుంచి 102 సర్వే నెంబర్లు గల భూములకు సంబంధించి ఏళ్లుగా వివాదాల్లో ఉన్నాయి. 1950ల నుంచే ఆ భూవివాదం కొనసాగుతోందని అధికారులు చెప్తున్నారు. 1990ల నుంచి మరింత ముదిరాయని చెప్తున్నారు. 2004 తర్వాత ఆ భూములపై కొందరు రాజకీయ నేతల కళ్తు పడ్డాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ భూవివాదం హైకోర్టు పరిధిలో ఉందని సమాచారం. ఆ వివాదస్పద భూముల వ్యవహారంలో తలదూర్చిన కొందరు పెద్దలు… వాటిని కొన్న పెద్దలు తమకు అనుకూలంగా రికార్డులు మార్చాలని అధికారులపై ఒత్తిళ్లు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 120 ఎకరాల వివాదంపై హైకోర్టులో కేసులున్నాయి. ఇందులో 77 ఎకరాలు కౌలుదారుల చేతుల్లో… 42 ఎకరాలు పట్టాదారుల ఆధీనంలో ఉన్నట్లు సమాచారం. వివాదస్పద భూముల వ్యవహారంలో ఓ మంత్రి పేరు, స్థానిక ఎమ్మెల్యే పేరు, మరికొందరు రాజకీయ నేతల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మంత్రి ఎవరు ? ఆ ఎమ్మెల్యే ఎవరు ? మిగతా రాజకీయ నేతలు ఎవరు అన్నది చర్చనీయాంశంగా మారింది. విజయారెడ్డి భర్త సుభాష్ రెడ్డితో పాటు ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కూడా భూమాఫియా ఈ హత్య కేసుతో సంబంధముందని ఆరోపించారు. సీబీఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపిస్తే అసలు నిజాలు వెలుగుచూసే అవకాశం లేదన్నారు. సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశారు విజయారెడ్డి భర్త సుభాష్ రెడ్డి.