బలిమెల నుంచి కచ్చులూరు దాకా : ‘ధర్మాడి సత్యం’ గురించి ఆసక్తికర విషయాలు

చదువు లేదు. కనీసం పలకా బలపం పట్టిన గుర్తులేదు. టెక్నాలజీపై అసలు అవగాహన లేదు. మోడరన్ టెక్నాలజీ అందుబాటులోకొచ్చినా.. NDRF, నెవీ బృందాలెన్ని ఉన్నా.. సంప్రదాయ పద్ధతుల్లో బోటు వెలికితీయడంలో ఆయనకు ఆయనే సాటి. నదీగర్భంలో మునిగిపోయిన పడవలని, బోట్లను వెలికితీయడం వెన్నతో పెట్టిన విద్య. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ బోటు ప్రమాదం మునిగినా దాన్ని వెలికితీసేందుకు వినిపించే పేరు ధర్మాడి సత్యం. 35 ఏళ్లుగా ఇదే పని. ఎన్నో అనుభవాలు. డీప్ సీలోకి వెళ్లి మునిగిన నావలను బయటకు తీయడం ధర్మాడి సత్యం స్పెషాలిటీ. సుడిగుండాలు ఎదురైనా, వాతావరణం అనుకూలించకపోయినా… ఒక్కసారి ఫిక్సైతే పట్టువదలకుండా ప్రయత్నించడమే ధర్మాడి సత్యంకు మాత్రమే సాధ్యమయ్యే పని. తనకది తాతలు, తండ్రుల నుంచి వచ్చిన వారసత్వ విద్య అంటారాయన. 2 వేల టన్నుల బరువు వరకు అది ఎంత పెద్ద బోటైనా సరే మ్యాన్యువల్ గా బయటకు తీయడం ధర్మాడి సత్యంకు వెన్నతో పెట్టిన విద్య. కచ్చులూరు బోటును తీసేందుకు మొదట రెస్క్యూ టీం ప్రయత్నించినా తమ వల్ల సాధ్యం కాదని చేతులెత్తేశారు. అలాంటి టైంలో రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం టీం… మునిగిన బోటును ఒడ్డుకు చేర్చింది. ధర్మాడి సత్యం టీంలో మొత్తం పది మంది ఉంటారు. అంతా కుటుంబ సభ్యులు, సమీప బంధువులే. అయితే కచ్చులూరు ఆపరేషన్ కోసం వైజాగ్ నుంచి మరో 15 మంది డీప్ డైవర్స్ సాయం తీసుకున్నారు. చదువు రాకపోయినా బోటు ఆనవాళ్లు తెలిశాక పేపర్ పై స్కెచ్ వేసి… ఎక్కడ లంగరేస్తే బోటును వెలికితీయ్యొచ్చని ఔపోసన పట్టారాయన. రాయల్ వశిష్ఠ బోటు మొదట లంగరేస్తే డ్రైవర్ క్యాబిన్ ఊడొచ్చింది. అయినా నిరాశకు లోనవని సత్యం… ఇంజిన్ ఫ్యాన్ కు ఐరన్ రోప్ కట్టండని సలహా ఇచ్చారు. అది వర్కవుట్ అయింది. దాంతో బోటు బయటకొచ్చింది. ఆపరేషన్ రాయల్ వశిష్ఠ సక్సెస్ అయింది. ప్లాన్ ఏ ఫెయిలైతే ప్లాన్ బీ ఉంటుందన్నట్టు… పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చడంలో ఆయన దిట్ట అంటారు తెలిసినవాళ్లు.

ధర్మాడి సత్యం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన 53 ఏళ్ల ధర్మాడి సత్యం పేరు కచ్చులూరులో మునిగిన రాయల్ వశిష్ఠ బోటును బయటకు తీయడంతో మరోసారి మార్మోగుతోంది. దీనికన్నా ముందు 2008లో బలిమెల ఘటనలోనూ ఇంతకుమించిన రిస్కీ ఆపరేషన్ చేశారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని బలిమెల వద్ద 60 మంది గ్రేహౌండ్ కమాండోస్ ప్రయాణిస్తున్న బోటుపై నక్సల్స్ అటాక్ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన అది. ఆ ఘటనలో 38 మంది సైనికులు జలసమాధి అయ్యారు. ఆ ఘటనలోనూ వంద అడుగుల లోతులో ఉన్న బోటును వెలికితీసింది ధర్మాడి సత్యం బృందమే. అప్పట్లో ఉత్తరాఖండ్ కు చెందిన రెస్క్యూ టీంతో కలిసి విజయవంతంగా ఆ బోటును బయటకు తీశారు. 2016 డిసెంబర్ లో నాగార్జున సాగర్ ఒడ్డున ఉన్న పాలంకి శివాలయానికి 40 మందితో బయల్దేరిన మరపడవ మునిగిపోయింది. ఆ ఘటనలో 22 మంది ఒడ్డుకు చేరారు. మిగతావాళ్లలో చాలామంది జలసమాధి అయ్యారు. ఆ ఘటనలోనూ మరపడవను బయటకు తీసింది కూడా ధర్మాడి సత్యం బృందమే. పడవ ప్రమాదాలు ఏవైనా సరే… ఆయన నమ్మిన సిద్ధాంతం ఒకటే. జలసమాధి అయినవాళ్ల ఆనవాళ్లను కనీసం కుటుంబ సభ్యులకు చూపించడం తన బాధ్యత అంటారు దర్మాడి సత్యం. కచ్చులూరు రాయల్ వశిష్ఠ ఆపరేషన్ తన జీవితంలో అన్నింటికన్నా అతి రిస్కీ ఆపరేషన్ అని.. అయినా అయినవాళ్ల కన్నీళ్లలో భాగం పంచుకునేందుకు రిస్క్ చేశామని చెప్తున్నారాయన. కచ్చులూరు ఆపరేషన్ కు ప్రభుత్వం 22 లక్షల 70 వేల కాంట్రాక్టిచ్చింది. గతంలో కొన్ని ఆపరేషన్స్ కు డబ్బులు కూడా తీసుకోలేదన్నారాయన. కష్టానికి తగిన ప్రతిఫలం కన్నా.. ఇలాంటి ఆపరేషన్లలో తమవాళ్లను పోగొట్టుకున్నవాళ్ల బాధను కొంతైనా తీర్చగలిగానన్న సంతృప్తి చాలంటారాయన. ఆయన మానవతా దృక్పథం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. హ్యాట్సాఫ్ టు ధర్మాడి సత్యం.

Leave a Reply