కశ్మీర్ విషయంలో ఏం జరిగింది ? నెహ్రూ విలనా ? : సర్ధార్ సంగతేంటి ?

1947లో భారత్ కు స్వతంత్రం వచ్చినప్పుడు 500కు పైగా స్వతంత్ర రాజ్యాలు భారత్ లో విలీనమయ్యాయి. కేవలం మూడంటే మూడు సంస్థానాల విషయంలో వివాదం తలెత్తింది. అవే హైదరాబాద్, జూనాగఢ్, జమ్మూ-కశ్మీర్. నాటి హోం మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో హైదరాబాద్, జూనాగఢ్ రాజ్యాలు భారత్ లో విలీనమయ్యాయి. కానీ జమ్మూ-కశ్మీర్ విషయంలో మాత్రం నెహ్రూ ప్రభుత్వం ఓ నిర్ణయానికి రాలేకపోయింది. 1947లో జమ్మూ-కశ్మీర్ రాజు మహారాజా హరిసింగ్ తన రాజ్యాన్ని భారత్ లో విలీనం చేసేందుకు అంగీకరించాడు. పాకిస్తాన్ నుంచి ముప్పును ముందే గ్రహించి… ఇండియన్ యూనియన్ లో విలీనానికి ఒప్పుకున్నారు. అయితే అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ ఓ సలహా ఇచ్చారు. ‘‘కశ్మీర్ కోసం పాకిస్తాన్, భారత్ మధ్య ఏకాభిప్రాయం లేదు, కాబట్టి ఎవరికి చెందాలన్న దానిపై ప్రజాభిప్రాయ సేకరణ(ప్లెబిసైట్), ఎన్నికలు నిర్వహించాలని’’ సూచించారు. కానీ ప్రజా ఆకాంక్షను తెలుసుకునే ప్రజాభిప్రాయ సేకరణ రాన్రానూ క్లిష్టంగా మారింది. 1949 యుద్ధంలో కశ్మీర్ లోని మూడొంతులు లద్ధాక్, జమ్మూ-కశ్మీర్ లోయలతో కూడిన రెండొంతుల భూభాగం భారత్ కంట్రోల్లోకొచ్చింది. ఇపుడున్న ఆజాదీ కశ్మీర్ (పాకిస్తాన్ పిలిచే ప్రాత్రం… ఉత్తర ప్రాంతం) పాకిస్తాన్ ఆధీనంలోకి వెళ్లింది. అదే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్(POK). దాన్ని అడ్డం పెట్టుకునే కశ్మీర్ పై పెత్తనం చేస్తూ… మొత్తం జమ్మూ-కశ్మీర్ నాదేనంటోంది పాకిస్తాన్.

నెహ్రూ ఎందుకు విలన్ అయ్యారంటే ? : కశ్మీర్ లో మూడోవంతు భాగం పాక్ ఆక్రమించడంతో.. ఆ సమస్యను UNO దృష్టికి తీస్కెళ్లాలని లార్డ్ మౌంట్ బాటెన్ నెహ్రూకు సూచించారు. అదే సమయంలో నెహ్రూకు సన్నిహితుడైన షేక్ అబ్దుల్లా జమ్మూ-కశ్మీర్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరాడు. ప్రజాభిప్రాయ సేకరణ జరపాలన్నాడు. జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీ సమ్మతితో ఆర్టికల్ 370లో మార్పులు చెయ్యొచ్చనే నిబంధన విధించారు. ఆర్టికల్ 370ని తాత్కాలిక ప్రొవిజన్ గానే రూపొందించామని చెప్పారు నెహ్రూ. కానీ ఇండియన్ యూనియన్లో చేరుతున్నట్టు రూపొందించిన ప్రతిపాదనకు జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీ 1956లో ఆమోదం తెలిపింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంత్రిగా ఉండగా సంస్థానాల విలీనంలో కీలకపాత్ర పోషించారు. హైదరాబాద్, జూనాగఢ్ లనూ తన వ్యూహ చతురతతో ఇండియన్ యూనియన్ లో కలిపారు. అయితే నెహ్రూ ప్రత్యేక శ్రద్ధ(నెహ్రూ పూర్వీకులది కశ్మీరే అంటారు), షేక్ అబ్దుల్లాతో నెహ్రూకు ఉన్న సాన్నిహిత్యంతో పటేల్ దాని విషయంలో జోక్యం చేసుకోలేదంటారు. ఆర్టికల్ 370కి షేక్ అబ్దుల్లా, నెహ్రూ తుది మెరుగులు దిద్దాక.. ఏ శాఖ బాధ్యతలు చేపట్టని మంత్రి గోపాలస్వామి అయ్యంగార్ కు కశ్మీర్ పోర్టుఫోలియోను అప్పగించారు. అంతకుముందు మహరాజా హరి సింగ్ దగ్గర ఆరేళ్లు ప్రధానిగా పనిచేశారు అయ్యంగార్. కశ్మీర్ వ్యవహారాల్లో ఆయనకు మంచి పట్టుండేదంటారు. ఆయనే ఆర్టికల్ 370ని రాజ్యాంగ సభ ముందుంచారు. దీనికి సంబంధించి పటేల్ కు కనీసం సమాచారమివ్వలేదన్నది ఓ వాదన. ఇవన్నీ గమనించిన పటేల్ ఆ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదంటారు. పైగా రాజీనామాకు సిద్ధపడ్డారట. తర్వాత రాజ్యాంగ సభలో ముసాయిదా ఆమోదం పొందేలా చూసే బాధ్యతలను గోపాలస్వామి అయ్యంగార్ కు అప్పగించారట. రాజ్యాంగ సభ, కాంగ్రెస్ ప్రతినిధులు ఆ ముసాయిదాకు ఆమోదం తెలుపలేదు. ఆ టైంలో విదేశాల్లో ఉన్న ప్రధాని నెహ్రూ… ఆర్టికల్ 370కి లైన్ క్లియర్ అయ్యేలా చూడాలని పటేల్ ను రెక్వెస్ట్ చేశారన్నది మరో ఆర్గ్యుమెంట్. ప్రధాని కోరిక మేరకు రంగంలోకి దిగిన సర్దార్ రాజ్యాంగ సభను, కాంగ్రెస్ ప్రతినిధులను ఒప్పించారు. అంతకుముందు ఆర్టికల్ 370 విషయంలో ఎన్నో అభ్యంతరాలున్నా… అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా, పటేల్ మాటను కాదనలేక ఆమోదం తెలిపారంటారు. దాంతో జమ్మూ-కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి లభించింది. అప్పటికి అది తాత్కాలిక ఏర్పాటే. కానీ తర్వాతి ప్రభుత్వాల చేతగానితనం… జమ్మూ-కశ్మీరీ నేతల రాజకీయ కక్కుర్తి కారణంగా అదో రావణకాష్టంలా రగిలింది. ఆర్టికల్ 370ని ఏం చేయలేకపోయారు. జమ్మూ-కశ్మీర్ విషయంలో ఓ ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేకపోయారు. నిజానికి జమ్మూ-కశ్మీర్ విషయంలో నాటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. నాటి విదేశాంగ విధానం, సోవియట్ యూనియన్ మద్ధతు, బ్రిటీష్ పాలకుల ఒత్తిడి లాంటివన్నీ కలిపి నెహ్రూకు అడుగుడుగునా ఆటంకాలు ఏర్పడ్డాయి. నాటి రాజకీయ నేతలంతా కలిసి నిర్ణయం తీసుకుంటే.. నెహ్రూ మాత్రమే బ్లేమ్ అయ్యారంటారు. జమ్మూ-కశ్మీర్ విషయంలో నెహ్రూ విలన్ అయితే సర్దార్ పటేల్ కూడా విలనే. కానీ చరిత్రను వక్రీకరించారు. నెహ్రూను విలన్ గా చూపించి… శాస్త్రిని హీరోగా మార్చారు. ఓరకంగా నెహ్రూ-పటేల్ తర్వాత… జమ్మూ-కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి కారణంగా మూడు కుటుంబాల(అబ్ధుల్లా, ముఫ్తీ, గులాం) అధిపత్యం కొనసాగింది. వాళ్లకు అడ్డుకట్ట వేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదంటారు చరిత్రకారులు.

LEAVE A REPLY