వెల్ డన్ సత్యం, బోటు తీసిన ధర్మాడి కాంట్రాక్ట్ ఎంతో తెలుసా ?

పాపికొండల విహారయాత్రకు బయల్దేరిన రాయల్ వశిష్ఠ బోటు ఎట్టకేలకు బయటకొచ్చింది. 38 రోజుల నిరీక్షణకు తెరపడింది. పోర్టు అధికారి కెప్టెన్ ఆదినారాయణ నేతృత్వంలో పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి ధర్మాడి సత్యం బృందంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మునిగిపోయిన బోటును బయటకు తీయడం అసాధ్యం అనుకున్న తరుణంలో రాదనుకున్న బోటును బయటకు తీసి చూపింది ధర్మాడి సత్యం బృందం. నెలరోజులకు పైగా నీళ్లలో నానుతూ ఉండటం, బోటులో ఇసుక మేట వేయడం, రాళ్లలో ఇరుక్కుని ఉండటంతో పలుమార్లు లంగరేసినా బోటు పార్టులు ఊడొచ్చాయి తప్ప పూర్తిగా బోటు బయటకు రాలేదు. దాంతో ధర్మాడి సత్యం కొంత నిరాశ చెందినా రిపీటెడ్ గా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. అయినవాళ్లను పోగొట్టుకున్న వాళ్ల ఆవేదననే బోటు వెలికితీసేందుకు తమలో పట్టుదల పెంచిందన్నా ధర్మాడి సత్యం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని.. మళ్లీ ఇలాంటి ఆపరేషన్ తాము చేపట్టకూడని పరిస్థితులు రావాలని ఆకాంక్షించారు. బోటు వెలికితీసిన స్కూబా డైవర్లంతా ధర్మాడి సత్యం బంధుమిత్రులే కావడం మరో విశేషం. అయితే ఈ ఆపరేషన్ కు ధర్మాడి సత్యం తీసుకున్న కాంట్రాక్ట్ ఎంతో తెలుసా ? రూ.22.70 లక్షలు. పనికి తగ్గ ప్రతిఫలం దక్కకపోయినా.. రాయల్ వశిష్ఠ బోటును బయటకు తీయడం సంతృప్తి మిగిలిందన్నారు సత్యం. మిగతా ఏమైనా ఉంటే కలెక్టర్ చూసుకుంటారని పెద్ద మనసు చాటుకున్నారాయన.

బోటు మునిగిన తర్వాత రెస్క్యూ టీం చేతులెత్తేసింది. రెస్క్యూ టీం వెనుదిరగడంతో బోటును బయటకు తీయడం అసాధ్యం అనుకున్నారంతా. చేసేది లేక సంప్రదాయ పద్ధతిలో ఆపరేషన్ చేయాలని డిసైడ్ చేశారు. బోటు వెలికితీతలో తిరుగులేని రికార్డున్న ధర్మాడి సత్యం టీంకు కాంట్రాక్టిచ్చారు. పని ప్రారంభించిన ధర్మాడి సత్యం టీంకు మొదటి నుంచి ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. గోదావరి పోటెత్తింది. ఎడతెరిపి లేని వర్షాలు తగులుకున్నాయి. దాంతో మొదట తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా పట్టువిడవలేదు ధర్మాడి సత్యం బృందం. లంగరేస్తే తాళ్లే తెగిపోయాయి. పని ఏమాత్రం ముందుకు సాగలేదు. అయినా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. స్కూబా డైవర్లు ముందు ఈ ఆపరేషన్ కు జంకినా పరిస్థితిని క్లియర్ గా వివరించి… అసలు ఎందుకు మనం ఈ ఆపరేషన్ చేయాలో వివరించి ఒప్పించారు. అయినవాళ్లను పోగొట్టుకున్నవాళ్ల కన్నీళ్లు తుడిచేందుకైనా కలిసిరావాలని వేడుకున్నారట. దాంతో స్కూబా డైవర్లు అంగీకరించారని సమాచారం. ఇలా చెప్పుకుంటూ పోతే రాయల్ వశిష్ట బోటు వెలికితీత పనుల్లో ఎన్నో మానవీయ కోణాలున్నాయంటున్నారు.

ఇకపోతే భవిష్యత్తులో ఇలాంటి బోటు యాక్సిడెంట్లు జరగకుండా కఠిన నిబంధనలను రూపొందిస్తోంది జగన్ ప్రభుత్వం. ఇప్పటికే పాపికొండల విహారయాత్రను రద్దు చేసింది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ రూపొందించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. IV యాక్ట్ ను రూపొందించి దాన్ని అమలు చేసిన తర్వాతే మళ్లీ పాపికొండల యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు.