మాస్కు కట్టాల్సింది మూతికి, బైకు నెంబర్ ప్లేటుకు కాదు…

మాస్కు కట్టాల్సింది మూతికి, బైకు నెంబర్ ప్లేటుకు కాదు…

కరోనా వచ్చిన కాన్నుంచి…బైకర్స్ తెల్వి ఎక్వైంది. బైకేస్కోని రోడ్డుమీదికి వెళ్తే చాలు… మూతికి మాస్కు పెట్టుకున్నా పెట్కోకపోయినా… బైక్ నెంబర్ ప్లేటుకు మాత్రం మాస్కులు పెట్టేస్తున్నారు. మొన్నామధ్య పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు..కొన్ని బైకులను పట్టుకున్నారు. నెంబర్ ప్లేట్లకు మాస్కులు కట్టి…ఫైన్ పడకుండా తప్పించుకున్న తిర్గుతున్న బైకులను సీజ్ చేశారు.

అయినా…సరే పోలీసులకు దొరకకుండా తెలివిగా కొంతమంది తప్పించుకు తిర్గుతున్నారు. అలాంటి వారికి సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులు షాక్‌ ఇచ్చారు. ఇకపై చలాన్లను తప్పించుకోవటానికి నెంబర్‌ ప్లేటుపై ట్రిక్కులు చేయాలనుకుంటే తిక్క కుదురుతుందని హెచ్చరిస్తున్నారు. నెంబర్‌ ప్లేటు సరిగా లేని బైకులకు రూ. 200, ఉద్దేశ్యపూర్వకంగా బండి వివరాలను దాయాలని చూసేవారికి రూ. 500 ఫైన్‌ వేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ ట్విటర్‌ ఖాతాలో ‘‘ అనుకున్నది ఒక్కటీ, అయినది ఒక్కటీ.. బోల్తా కొట్టిందిలే బుల్‌ బుల్‌ పిట్ట..’’ అంటూ ఓ ట్విట్‌ను చేశారు.

దీనిపై నెటిజన్లు కూడా తమ స్టైల్లో స్పందిస్తున్నారు..‘‘  హైదరాబాద్‌ పోలీసులనుంచి తప్పించుకోవటం కష్టం కాదు! అసాధ్యం.. ఇది మోసం సార్‌! అలాంటి వాళ్లను జైళ్లలో వేయాలి.. నగర పౌరులకు చలాన్లు విధించే డ్యూటీలో మీకు మీరే సాటి సార్‌!.. చున్నీలు చుట్టినా.. మాస్కులు కట్టినా ఇకపై లాభం ఉండదు’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అది సరేగనీ…కొందరు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ మల్లించడం మానేసి ఫోటోలు కొట్టుడే పనిగా పెట్టుకున్నారు…అలాంటి వాళ్లను కూడా జర పట్టించుకోండి సారు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.