కొందరు రివ్యూలు రాస్తే పైసల్ తీస్కొని రాసినట్టే ఉంటుంది. కొందరు రివ్యూ రాస్తే.. విమర్శించడానికి మాత్రమే రాసినట్టు ఉంటుంది. కానీ..కొందరు రివ్యూలు రాస్తే సినిమాలో నటించిన నటీనటులే కాదు… తెరవెనకాల పని చేసే ప్రతీ ఒక్కరి కష్టం కనపడుతుంది. అలాంటి వారిల్లో సినిమా జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్ కూడా ఒకరు. మనోడు రాసే రివ్యూ సగటు ప్రేక్షకుడికి నచ్చేలా ఉంటుంది. మా కొట్లాట వీక్షకుల కోసం ప్రవీణ్ కుమార్ రివ్యూను అతని ఫేస్ బుక్ వాల్ పై నుంచి కొట్టేశాం…మీకోసం…

“చరిత్రలో మనం ఉండకపోవచ్చు.. కానీ చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దేశభక్తి గురించి చెప్పడానికి ఈ ముక్క చాలు.. చరిత్ర మరచిన వీరుడి గురించి చిరంజీవి మళ్లీ గుర్తు చేశాడు.. సినిమాగా చూసుకుంటే సైరా నరసింహారెడ్డిలో లోపాలు కనిపిస్తాయేమో కానీ.. ఒక చరిత్రను తెరకెక్కించిన విధానం చూస్తే మాత్రం ఏ లోపం లేదు.. చరిత్రను చెడగొట్టకుండా.. కమర్షియల్ అంశాలు జోడించి.. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తన వంతు బాగానే తెరకెక్కించాడు..

ఇక వయసు మర్చిపోయి చిరంజీవి కూడా ఉయ్యాలవాడ పాత్రకు ప్రాణం పోసాడు.. రేనాటి సూర్యుడుగా.. స్వతంత్ర్య భారతానికి అసువులు బాసిన తొలి సమిధగా.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఎందరికో స్ఫూర్తిదాయకం.. అలాంటి కథను తీసుకొని.. పక్కదారి పట్టకుండా.. తనకు ఉన్న పరిధిలోనే చిరంజీవి ఇమేజ్ ను బ్యాలెన్స్ చేస్తూ కమర్షియల్ సినిమా తీసాడు సురేందర్ రెడ్డి.. 18వ శతాబ్దపు నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు అద్భుతంగా చూపించింది ఆర్ట్ డైరెక్షన్ టీం.. నాడు భారతదేశంలో బ్రిటిష్ వారి అక్రమాలను చూపిస్తూ.. వాళ్లపై ఉయ్యాలవాడ చేసిన పరాక్రమాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు సురేందర్ రెడ్డి.. ఫస్ట్ హాఫ్ లో పాత్రల పరిచయం కోసం కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు దర్శకుడు.. దాంతో తొలి అర్ధ భాగం కాస్త సాగినట్లు అనిపిస్తుంది..

ఒక్కసారి తెల్లదొరలపై ఉయ్యాలవాడ తిరుగుబాటు మొదలైన తర్వాత.. క్లైమాక్స్ వరకు ఎక్కడా ఆగకుండా పరుగులు పెట్టింది కథ.. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ సీన్ బాగుంది.. ఈ సీన్ డిజైన్ చేశాడు దర్శకుడు.. ఉరికొయ్యకు వేలాడుతూ కూడా ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను రేకెత్తించిన ఆయన మరణం అమరం.. ఉయ్యాలవాడ పాత్రలో చిరంజీవి నటించలేదు.. జీవించాడు.. నరసింహారెడ్డి గురువు పాత్రలో అమితాబ్ బచ్చన్ అద్భుతంగా నటించాడు.. సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు చిన్నచిన్న పాత్రలు చేసిన ఎవరికి వారు మెప్పించారు… నయనతార, తమన్నా కథలో భాగంగా మారిపోయారు.. ఓవరాల్ గా సైరా నరసింహారెడ్డి.. ఓ దేశభక్తుడి వీరమరణం..”

– ప్రవీణ్ కుమార్, సినీ జర్నలిస్ట్