కేసీఆర్ మాటలతో మాలో కసి పెరిగింది : ఏపీ మంత్రి

కేసీఆర్ మాటలతో మాలో కసి పెరిగింది : ఏపీ మంత్రి

పక్క రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు కదా అన్న ఓ జర్నలిస్ట్ క్వశ్చన్ తో సీఎం కేసీఆర్ ఎంత ఫైరయ్యారో తెలంగాణ చూసింది. సమ్మెకు ముగింపు కాదు ఆర్టీసీనే మునుగుతుందని కామెంట్ చేసి తీవ్ర చర్చకు దారితీసేలా చేశారు కేసీఆర్. ఆ మాటలే తమలో కసిని పెంచాయంటున్నారు ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తీరతామన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వంలో పట్టుదల, కసి పెరిగిందన్నారాయన. నిర్ణీత సమయంలోనే ఆర్టీసీ ప్రభుత్వ రవాణా సంస్థగా మారుతుందని స్పష్టం చేశారు.

తెలంగాణ ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. వ్యవస్థలన్నీ ప్రైవేటుపరం చేస్తూ పోతే ఏపీలో ఒక ‘‘కార్పొరేషన్ ను ప్రభుత్వంలో విలీనం చేయడమనేది చాలా గొప్ప నిర్ణయం, మొండి నిర్ణయం అన్నారు. ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీలో ఏం జరుగుతుందో ఆరు నెలల్లో తేలుతుందన్నారు. ఆ వ్యాఖ్యలతో మా ప్రభుత్వంలో కసి పెరిగింది. బాధ్యత పెరిగింది. సీఎం జగన్ ఆలోచనల మేరకే ఆర్టీసీ కార్మికులను విలీనం చేస్తామని చెప్పాం. దాన్ని అమలు చేసి తీరాలన్న పట్టుదలను కేసీఆర్ మాలో పెంచారు. ఆయన అన్న మాటను మేం పాజిటివ్ గా తీసుకున్నాం. ఖచ్చితంగా మూడు నెలల్లోనో, ఆరు నెలల్లోనో నెరవేర్చి తీరుతాం’’ అని మంత్రి పేర్ని నాని అన్నారు.