కాలిపోయింది విజయారెడ్డే అన్న క్లారిటీ రావడానికి ఎంత టైం పట్టిందంటే !

అబ్దుల్లాపూర్ మేట్ ఎమ్మార్వో సజీవదహనమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ క్రైం సీన్ చూసిన, విన్న ప్రతీ ఒక్కరి గుండె ఝలదరించింది. ఓ లేడీ రెవిన్యూ ఆఫీసర్ సజీవదహనం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. రెవిన్యూ యంత్రాంగంపై జనానికి ఉన్న చీదర సంగతి పక్కనపెడితే ఓ మహిళ మంటల్లో కాలి బూడిదై… క్షణాల వ్యవధిలో ప్రాణాలొదలడం అత్యంత దారుణం. పెనువిషాదం.

సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లిన కూర సురేష్ ముదిరాజ్… విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ మంటల్లో తానూ కాలుతూ కేకలు వేస్తూ బయటకొచ్చాడు. తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న చాలామందికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఒక్కసారిగా పేలుడు శబ్ధం వినిపించడంతో అంతా ఎమ్మార్వో రూము వైపు పరుగులు తీశారు. అప్పటికే ఒళ్లంతా మంటలంటుకుని తన రూం నుంచి కాలుతూ బయటకొచ్చి పడిపోయారు విజయారెడ్డి. బతికుండగానే ఒళ్లంతా చితిమంటల్లో కాలుతున్న సీన్ కనిపించిందక్కడ. సుమారు రెండు నిమిషాల పాటు ఆమె బాడీ బర్న్ అయింది. అక్కడున్నవాళ్లు ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రెండుసార్లు అటు, ఇటు కదిలిన ఎమ్మార్వో.. చివరికి అచేతనంగా పడిపోయింది.

ఇక్కడ విషాదమేంటంటే… కాలిన ఆ బాడీ విజయారెడ్డిదే అని నిర్ధారించుకునేందుకు తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి చాలా టైమే పట్టింది. మేడమ్ ఇంకా రూంలోనే ఉన్నారేమో.. మంటల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు బాత్ రూంలోకి వెళ్లారేమో వెతకండని అక్కడున్నవాళ్లు అరుస్తున్నారు. బయట పడి ఉన్నది విజయారెడ్డి అని మాత్రం గుర్తించలేకపోయారు. రూంలో చీకటి, పొగలు కమ్ముకోవడంతో మేడమ్ ఎక్కడుందో ఎవరూ గుర్తించలేకపోయారు. చివరికి ఆమె చేతికున్న వాచీని చూసి నిర్ధారించుకున్నారు. అప్పటికే ఆమె ప్రాణాలు గాల్లో కలిశాయి. విజయారెడ్డి సజీవ దహనమైంది. అసలు ఆ ఘటన ఎలా జరిగిందో చాలాసేపటివరకు ఎవరికీ అర్థం కాలేదంటే.. విజయారెడ్డి ఎంత విషాదస్థితిలో కన్నుమూసిందో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది కరెంట్ ఆఫీసుకు ఫోన్ చేసి లైన్ కట్ చేయమని చెప్పడం కనిపించింది. ఎవరో పెట్రోల్ పోసి అంటించుకున్నారన్న మాటలు వినిపించాయి. గంటలు గడిస్తే తప్ప అక్కడేం జరిగిందో చాలామందికి క్లారిటీ రాలేదు. సాయంత్రం 4 గంటల తర్వాత ఆ వార్త రాష్ట్రవ్యాప్తంగా దావణంలా వ్యాపించింది.