Nandyala: భర్త,తోటికోడలు టార్చర్.. పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న తల్లి

Nandyala

Nandyala:  నంద్యాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్నబిడ్డలకు విషమిచ్చి, తాను ఉరివేసుకుని ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, ఆడపడుచు, తోటికోడలు పెట్టిన మానసిక వేదన భరించలేకే తన ఏడు నెలల పసికందును, ఐదేళ్ల కుమారుడిని చంపుకుని మల్లిక అనే వివాహిత తనువు చాలించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లలితానగర్‌కు చెందిన ఉదయ్‌కిరణ్‌కు, ఎన్జీవో కాలనీకి చెందిన మల్లిక(27)కు ఏడేళ్ల కిందట పెళ్లి అయింది. ఈ దంపతులకు కుమారుడు ఇషాంత్‌సాయి(5), కుమార్తె పరిణిత(7 నెలలు)పిల్లులన్నారు. కొన్నేళ్లపాటు వీరి సంసారం సజావుగా సాగింది. అయితే రెండేళ్ల నుంచి భర్తతో పాటుగా తోటికోడలు ప్రసన్న, ఆడపడుచు గీత సూటిపోటి మాటలతో మల్లికను ఇబ్బందులకు గురిచేశారు. ఈ క్రమంలో మల్లికపై భర్త దాడి చేశాడు.

దీంతో శనివారం ఉదయం గదిలోకి వెళ్లిన మల్లిక తలుపులు తీయలేదు. దీంతో ఉదయ్‌కిరణ్‌ వెంటనే కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేయడంతో వారంతా అక్కడికి చేరుకున్నారు. తలుపులు పగలకొట్టి చూడగా.. మల్లిక ఉరి వేసుకుని చనిపోగా.. ఇద్దరు పిల్లలు కూడా మృతిచెందారు. మల్లికను ఉదయ్‌కిరణ్, ఆడపడుచు, తోటికోడలు తరచూ వేధించేవారని, పిల్లలను, తల్లిని భర్తే హత్య చేసి ఉంటాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఉదయ్‌కిరణ్, ఆయన కుటుంబసభ్యులు పరారీలో ఉన్నారు.