Mumbai : గెంటేసిన సిగ్గులేకుండా వచ్చేశారు.. మహిళా బంగ్లాదేశీయులు అరెస్ట్!

mumbai

Mumbai : భారత్ నుండి బహిష్కరించినప్పటికీ మళ్లీ దొంగచాటుగా దేశంలోకి ప్రవేశించిన ఇద్దరు బంగ్లాదేశ్ మహిళలను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది ఆగస్టులో ముంబై క్రైమ్ బ్రాంచ్ వీరికి సరైన వీసా, పాస్‌పోర్ట్ లేవని గుర్తించి బంగ్లాదేశ్ అధికారులకు అప్పగించింది. అయితే, కొద్ది రోజుల వ్యవధిలోనే వీరు మళ్లీ సరిహద్దులు దాటి ముంబై చేరుకోవడం కలకలం రేపింది.

‘గేట్‌వే ఆఫ్ ఇండియా’ వద్ద ఓ మహిళ అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆమెను విచారించగా, తన పేరు జులేఖా జమాల్ షేక్ (38) అని, ప్రస్తుతం కామాటిపురా ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై నివసిస్తున్నట్లు తెలిపింది. గతంలో తనను దేశం నుండి పంపించివేసినా, భారత్-బంగ్లా సరిహద్దులోని అటవీ ప్రాంతం గుండా అక్రమంగా మళ్లీ భారత్‌లోకి ప్రవేశించానని ఆమె అంగీకరించింది. ఆమె వద్ద ఎటువంటి చట్టపరమైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు ఫారినర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

ఇక మరో కేసులో, బిల్కిస్ బేగం సిర్మియా అక్తర్ (30) అనే మహిళను కఫ్ పరేడ్ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత పోలీసుల ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పినప్పటికీ ఓ ఇన్ఫార్మర్ సహాయంతో ఆమె అసలు గుర్తింపు బయటపడింది. తాను కూడా ఆగస్టులో దేశం నుండి బహిష్కరణకు గురయ్యానని, ప్రస్తుతం అద్దె గదిలో నివసిస్తున్నానని ఆమె వెల్లడించింది. సోదాల్లో ఆమె వద్ద బంగ్లాదేశ్ జాతీయ గుర్తింపు కార్డు ఉన్న మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రస్తుతం ఈ ఇద్దరు మహిళలపై భారతీయ న్యాయ సంహిత (BNS), ఫారినర్స్ యాక్ట్ కింద ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదు చేశారు. వీరికి సరిహద్దులు దాటడానికి ఎవరైనా గ్యాంగ్‌లు సహకరించాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.