Vietnam Floods : కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి

Vietnam Floods : వియత్నాంలో మట్మో తుపాను కారణంగా రికార్డు స్థాయి వరదలు పోటెత్తాయి. ఉత్తర భూభాగంలోని పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ఐదుగురు గల్లంతైనట్లు వియత్నాం ప్రభుత్వం ప్రకటించింది. థాయ్ న్గుయెన్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో వేలమంది వరదల్లో చిక్కుకుపోయారు.

భవనాల పైఅంతస్తులకు ఎక్కి సహాయకసిబ్బంది తీసుకొచ్చే ఆహారం, మంచినీటి కోసం ప్రజలు నిరీక్షిస్తున్నారు. వందల వాహనాలు కొట్టుకుపోయాయి. ఇక్కడి కావో నది రికార్డు స్థాయిలో 29 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. చెరువుల్లా మారిన నగర వీధుల్లో రెస్క్యూ సిబ్బంది రబ్బరు బోట్లలో పర్యటిస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

చైనా సరిహద్దులోని లాంగ్ సోన్ ప్రావిన్సులో సైనికహెలికాప్టర్లతో టన్నుల కొద్దీ మంచినీరు, నూడుల్స్ , కేకు, పాలు, లైఫ్ జాకెట్లను అధికారులు సరఫరా చేస్తున్నారు. అనేక నగరాల్లో స్తంభాలు నీట మునగడంతో విద్యుత్ సరఫరా సహా కమ్యూనికేషన్ పూర్తిగా నిలిచిపోయింది.

గడిచిన 60 ఏళ్లలో ఇలాంటి వరదలను చూడలేదని స్థానిక అధికారులు తెలిపారు. వారం క్రితమే బులోయ్ టైపూన్ ప్రభావంతో సంభవించిన ప్రమాదాల్లో వియత్నాంలో 56 మంది మృతిచెందగా.. 710 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.