Doctor: దొంగనా డాక్టర్.. భార్యను కూల్గా చంపేసి ఆర్నెళ్లకు దొరికాడు!

doctor

Doctor: బెంగళూరులో ఒక డాక్టర్ భర్త తన భార్య ఆరోగ్య సమస్యలతో విసిగిపోయి, ఆమెకు మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చి మరి చంపేశాడు. అనంతరం ఆమెది సహజ మరణంగా చిత్రీకరించి అందర్ని నమ్మించాడు. చివరకు 6 నెలల తర్వాత అడ్డంగా దొరికిపోయాడు. తన వైద్య పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేసిన ఈ దారుణ హత్య వెనుక ఉన్న నిజం 6 నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది.

డాక్టర్ మహేంద్ర రెడ్డి (జనరల్ సర్జన్), డాక్టర్ కృతికా రెడ్డి (చర్మవ్యాధి నిపుణురాలు) ఇద్దరూ విక్టోరియా హాస్పిటల్‌లో పనిచేశారు. వారి వివాహం 26/05/2024న జరిగింది. వివాహానికి ముందు కృతికా రెడ్డికి అజీర్ణం, గ్యాస్ట్రిక్, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అయితే మహేంద్రకు ఇవేం చెప్పకుండానే వివాహం చేశారు.

వివాహం తర్వాత ఈ విషయం తెలియడం, ఆమెతో విసిగిపోయిన మహేంద్ర రెడ్డి తన భార్యను చంపడానికి పథకం వేశాడు. వివాహం అయిన 11 నెలల తర్వాత అంటే 23/04/2025న, కృతికా రెడ్డి స్పృహ కోల్పోయి తన తండ్రి ఇంట్లో కుప్పకూలిపోయింది. ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న కృతికా రెడ్డికి మహేంద్ర రెడ్డి ఇంజెక్షన్ ద్వారా కొంత మత్తుమందు ఇచ్చాడు.

అనంతరం ఆమెను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆసుపత్రికి చేరుకునేలోపే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే ఇది సహజ మరణమని భావించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకాడారు. అయితే కృతికా అక్క రేడియాలజిస్ట్ అయిన డాక్టర్ నికితా రెడ్డికి అనుమానం రావడంతో ఆమె కొన్ని రోజులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఆరు నెలల విచారణ తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) రిపోర్టులో కృతికా బాడీలో ప్రొపోఫోల్‌ అనే మత్తుమందు ఉన్నట్లుగా తేలింది. దీని కారణంగానే ఆమె మరణించిందని నిర్ధారణలో తేలింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, బెంగళూరు నుండి మణిపాల్ కు వెళ్లిన నిందితుడు డాక్టర్ మహేంద్ర రెడ్డిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. నిందితుడి ఇంటెన్సివ్ విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది.