Bengaluru : వరకట్న వేధింపుల ఆరోపణలు, వరుస ఆత్మహత్యలతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తన భార్య ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూరజ్ శివన్న (35), నాగ్‌పూర్‌లోని ఒక హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక అతని తల్లి జయంతి (60) కూడా ఆత్మహత్యకు యత్నించగా, ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
అసలేం జరిగింది అంటే .. బెంగళూరులోని విద్యారణ్యపుర నివాసి అయిన సూరజ్‌కు, గానవి అనే యువతితో ఒకటిన్నర నెల క్రితమే వివాహమైంది. అయితే, గత గురువారం గానవి తన ఇంట్లోనే ఆత్మహత్యకు యత్నించగా, చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై గానవి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అదనపు కట్నం కోసం సూరజ్ కుటుంబం వేధించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బెంగళూరు పోలీసులు సూరజ్‌పై వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదు చేశారు.
గానవి బంధువుల నుండి వేధింపులు, పోలీసుల అరెస్టుకు భయపడి సూరజ్ తన తల్లి, సోదరుడు సంజయ్‌తో కలిసి బెంగళూరు వదిలి వెళ్లిపోయారు. మొదట హైదరాబాద్ చేరుకున్న వీరు, అక్కడి నుండి డిసెంబర్ 26న నాగ్‌పూర్‌లోని వార్ధా రోడ్డులో ఉన్న ఒక హోటల్‌లో గది తీసుకున్నారు.
శుక్రవారం రాత్రి సూరజ్ గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కొడుకు చనిపోయాడని తెలియగానే తల్లి జయంతి కూడా ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుండి బయటపడినట్లు వైద్యులు తెలిపారు.
