Bengaluru : తెలంగాణకు చెందిన ఒక సాఫ్ట్వేర్ దంపతులు బెంగళూరులో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. సిద్దిపేటకు చెందిన భాను చందర్ రెడ్డి (32), అతని భార్య బీబీ షాజియా సిరాజ్ (31) తమ నివాసంలోనే ప్రాణాలు తీసుకున్నారు. వీరిద్దరూ ఐటీ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. సోమవారం నాడు భాను చందర్ రెడ్డి తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోయిన షాజియా అపార్ట్మెంట్ 17వ అంతస్తు నుండి దూకి మరణించింది.
పోలీసుల కథనం ప్రకారం.. భాను చందర్ రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సోమవారం భార్య ఇంట్లో లేని సమయంలో ఆయన గదిలో గడియ పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నారు. షాజియా బయట నుండి వచ్చి తలుపు తట్టినా సమాధానం రాకపోవడంతో, స్థానికులు సహాయంతో తలుపులు బద్దలు కొట్టారు. లోపల భర్త విగతజీవిగా పడి ఉండటం చూసి ఆమె షాక్‌కు గురైంది. ఆ విషాదాన్ని భరించలేక, భర్త మరణించిన కొద్దిసేపటికే ఆమె కూడా భవనం పైనుంచి దూకి ప్రాణాలు విడిచింది.
ఘటనా స్థలంలో భాను చందర్ రెడ్డి రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదని, అనారోగ్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు. వీరిద్దరూ తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారని సమాచారం. ప్రస్తుతం బెంగళూరులోని కొత్తనూరు పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
