BIG BREAKING : అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు పెను ప్రకంపనలు రేగుతున్నాయి. తాను విధించాలనుకున్న భారీ సుంకాలపై యూఎస్ సుప్రీంకోర్టు బ్రేకులు వేయడాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ తీర్పు వెలువడిన వెంటనే ఆయన అత్యున్నత న్యాయస్థానంపై యుద్ధం ప్రకటించారు. సుప్రీంకోర్టు నిర్ణయం అమెరికా దేశానికే అవమానకరమని, జడ్జిల తీరు చూసి తాను సిగ్గుపడుతున్నానని ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ జడ్జిలంతా విదేశీ శక్తుల ప్రభావానికి లోనయ్యారని, వారి వల్ల దేశ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆయన బహిరంగంగానే ఆరోపణలు గుప్పించారు. ఏది ఏమైనా తాను తీసుకున్న నిర్ణయం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ట్రంప్ భీష్మించుక కూర్చున్నారు. కోర్టు తీర్పును సవాల్ చేస్తూనే, 10 శాతం గ్లోబల్ టారిఫ్ ఆర్డర్ల మీద ఆయన వెంటనే సంతకం చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ఈ సందర్భంగా తీర్పును వ్యతిరేకించిన ఆరుగురు జడ్జిలపై ట్రంప్ శాపనార్థాలు పెడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ ప్రతిపాదించిన సుంకాలను వ్యతిరేకించిన ఆరుగురు జడ్జిలలో నలుగురు మహిళా జడ్జిలు ఉండటం గమనార్హం. అమీ కోనీ బారెట్, సోనియా సోటోమేయర్, ఎలెనా కగన్, కేతాంజీ బ్రౌన్ జాక్సన్లతో పాటు పురుష జడ్జిలు జాన్ రాబర్ట్స్, నీల్ గోర్సుచ్లు ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారు.
వీరి తీరు అమెరికా ఆర్థిక వ్యవస్థను వెనక్కి నెడుతోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ముగ్గురు జడ్జిలు క్లారెన్స్ థామస్, బ్రెట్ కవనాఫ్, శామ్యూల్ అలిటోలు మాత్రమే ట్రంప్ నిర్ణయానికి మద్దతుగా నిలిచారు. కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా ట్రంప్ తన మొండితనాన్ని ప్రదర్శిస్తూ టారిఫ్ ఆర్డర్లపై సంతకం చేయడంతో, రాబోయే రోజుల్లో అమెరికా ప్రభుత్వం మరియు సుప్రీంకోర్టు మధ్య పెద్ద ఘర్షణ వాతావరణం నెలకొనేలా కనిపిస్తోంది.
