Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఎవరూ ఊహించని ఒక వింత సంఘటన జరిగింది. పదో తరగతి బోర్డు పరీక్షలు రాస్తున్న ఒక మైనర్ బాలిక, స్కూల్ వాష్‌రూమ్‌లోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలియగానే పరీక్షా కేంద్రంలో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఆ అమ్మాయి దాదాపు రెండు గంటల పాటు మ్యాథ్స్ పేపర్ రాసింది. ఆ తర్వాత సడన్‌గా కడుపునొప్పి వస్తోందని చెప్పి వాష్‌రూమ్‌కు వెళ్లడానికి పర్మిషన్ తీసుకుంది. ఆమె లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే పసిబిడ్డ ఏడుపు వినిపించడంతో అక్కడున్న లేడీ స్టాఫ్ పరుగెత్తుకుంటూ వెళ్లారు. అక్కడ సీన్ చూసి వారంతా నోరెళ్లబెట్టారు.
వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి తల్లిని, బిడ్డను హాస్పిటల్‌కు తరలించారు. ఆ బిడ్డ ఎనిమిది నెలలకే పుట్టిందని, ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని డాక్టర్లు చెప్పారు. అయితే ఈ కేసులో పోలీసులు ఎంక్వైరీ చేయగా కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆ అమ్మాయికి ఇదివరకే నిశ్చితార్థం జరిగిందని, 18 ఏళ్లు నిండాక పెళ్లి చేద్దామని ఇంట్లో వాళ్లు అనుకుంటున్నారని తెలిసింది. కానీ, ఆ బిడ్డ తనకు కాబోయే భర్తది కాదని, తన ప్రియుడిదని ఆ అమ్మాయి పోలీసులకు చెప్పింది.
గతేడాది ఓ గర్బా ప్రోగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడ్డానని ఆమె వెల్లడించింది. తన కూతురు ప్రెగ్నెంట్ అన్న విషయం తమకు అస్సలు తెలియదని బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు. అమ్మాయి మైనర్ కావడంతో పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షా హాల్లో ఇలాంటి ఘటన జరగడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
