Donald Trump Neck : డొనాల్డ్ ట్రంప్ మెడపై మచ్చ…ఆరోగ్యంగానే ఉన్నాడా?

Donald Trump neck

Donald Trump Neck : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నప్పుడు, ఆయన మెడకు ఒక వైపున పెద్ద ఎర్రటి మచ్చ కనిపించింది. ఇది చూసిన నెటిజన్లు, మీడియా ప్రతినిధులు ఆయనకు ఏమైందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తాజాగా వైట్ హౌస్ వైద్యుడు డాక్టర్ సీన్ బార్బబెల్లా ఒక ప్రకటన విడుదల చేశారు.

వైట్ హౌస్ వివరణ ప్రకారం.. ట్రంప్ మెడపై కనిపిస్తున్న ఆ ఎర్రటి రంగుకు కారణం ఒక కామన్ క్రీమ్. చర్మ సంబంధిత సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా ఆయన ఒక క్రీమ్‌ను వాడుతున్నారు. ఆ క్రీమ్ వల్ల కలిగిన రియాక్షన్ కారణంగానే అక్కడ చర్మం ఎర్రగా మారిందని, ఇది మరో కొన్ని వారాల పాటు అలాగే ఉండే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేశారు. అయితే ఆ క్రీమ్ పేరు కానీ, ఆయనకు ఉన్న సమస్య గురించి కానీ వైట్ హౌస్ క్లారిటీ ఇవ్వలేదు.

చర్మం ఎందుకు ఎర్రగా మారుతుంది?

సాధారణంగా మనం వాడే చర్మ సంరక్షణ క్రీములు అందరికీ పడాలని లేదు. దీనిని వైద్య పరిభాషలో ‘కాంటాక్ట్ డెర్మటైటిస్’ (Contact Dermatitis) అని పిలుస్తారు. ఇది ప్రధానంగా రెండు రకాలు:

ఇరిటెంట్ కాంటాక్ట్ డెర్మటైటిస్: మనం వాడే సోపులు, క్రీములు లేదా కెమికల్స్ చర్మంపై నేరుగా ప్రభావం చూపించి, పై పొరను దెబ్బతీసినప్పుడు ఇలా జరుగుతుంది.
అలెర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్: కొన్ని రకాల మందులు లేదా క్రీములలో ఉండే పదార్థాలు మన రోగనిరోధక వ్యవస్థకు పడనప్పుడు వచ్చే రియాక్షన్ ఇది.

ట్రంప్ విషయంలో కూడా ఆ క్రీమ్‌లో ఉండే ఏదో ఒక పదార్థం వల్ల ఆయన చర్మం సున్నితంగా మారి ఎర్రబడవచ్చు. దురద, మంట, వాపు వంటివి కూడా ఇలాంటి సమయాల్లో కనిపిస్తాయి.

చర్మ నిపుణుల ప్రకారం.. ఏదైనా క్రీమ్ రాసినప్పుడు చర్మం ఎర్రబడితే వెంటనే దాన్ని ఆపేయాలి. ఒకవేళ ఆ ఎరుపు రంగు రెండు వారాల కంటే ఎక్కువ కాలం ఉన్నా, లేదా పొక్కులు (Blisters) వచ్చి నొప్పిగా అనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

ట్రంప్ ఆరోగ్యంపై గతంలోనూ కొన్ని అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు ఈ మెడ మచ్చల వ్యవహారం మరోసారి చర్చకు దారితీసింది. వైట్ హౌస్ వర్గాలు ఇది సాధారణ సైడ్ ఎఫెక్ట్ అని చెబుతున్నా, ఆ క్రీమ్ ఏంటనేది వెల్లడించకపోవడం గమనార్హం.