Haryana : మామూల్ది కాదయ్యా..పెద్ద సైకో..తనకంటే అందంగా ఉండొద్దని!

Haryana

Haryana : హర్యానాలో దారుణం జరిగింది.కుటుంబంలో తనకంటే ఎవరూ అందంగా కనిపించకూడదనే అసూయతో ఒక మహిళ ఏకంగా నలుగురు చిన్నారులను హత్య చేసింది. ఇందులో కన్న కొడుకు కూడా ఉన్నాడు. నిందితురాలిని పూనమ్ గా గుర్తించారు, తన సొంత మేనకోడలిని హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. ఓ పెళ్లి వేడుకలో పూనమ్ తన ఆరేళ్ల మేనకోడలిని నీటి తొట్టిలో ముంచి చంపిందని పోలీసులు తెలిపారు. ఆ తరువాత రూమ్ కు గడియ పెట్టి కిందికి వెళ్లిపోయింది.

అయితే కాసేపటి తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. గంట తర్వాత చిన్నారి నాయనమ్మ ఓంవతి ఆ గదికి వెళ్లి చూడగా… నీటి తొట్టిలో చిన్నారి తల మునిగి, కాళ్లు నేలపై ఉన్నాయి. వెంటనే ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దర్యాప్తులో నిందితురాలు పూనమ్ ఇదంతా చేసిందని తేల్చారు. పోలీసుల వివరాల ప్రకారం, పూనమ్‌కు తనకంటే ఎవరూ అందంగా కనిపించకూడదనే ద్వేషం. అసూయ ఉండేది. అందుకే అందంగా ఉన్న చిన్న బాలికలను ఆమె లక్ష్యంగా చేసుకుంది. పూనమ్ తన నేరాన్ని అంగీకరించింది. గతంలో మరో ముగ్గురు చిన్నారులను, తన సొంత మూడేళ్ల కొడుకు శుభమ్‌ను కూడా ఇదే పద్ధతిలో అంటే నీటిలో ముంచి హత్య చేసినట్లు ఒప్పుకుంది.

2023లో ఆమె తన మరదలి 9 ఏళ్ల కుమార్తె ఇషికను నీటి ట్యాంక్‌లో ముంచి చంపింది. అత్తమామలు తనను అనుమానిస్తారేమోననే భయంతో, అదే విధంగా తన 3 ఏళ్ల కొడుకు శుభమ్‌ను చంపేసింది. ఈ సంవత్సరం ఆగస్టులో తన కజిన్ సోదరుడి 6 ఏళ్ల కుమార్తె జియా ఎక్కువ అందంగా ఉందని భావించి, ఆమెను కూడా హత్య చేసింది. విచారణలో పూనమ్ నిజం ఒప్పుకునేంతవరకు, ఈ చిన్నారుల మరణాలన్నీ ప్రమాదవశాత్తు జరిగినట్లుగానే కుటుంబ సభ్యులు భావించారు.