Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో దారుణం..హిందువును కాల్చి చంపేశాడు!

Bangladesh

Bangladesh:  బంగ్లాదేశ్‌లో మరో దారుణం జరిగింది. మైమన్‌సింగ్ జిల్లాలోని మరో హిందువు హత్య జరిగింది. సుల్తానా స్వెటర్స్ లిమిటెడ్ అనే గార్మెంట్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న బజేంద్ర బిస్వాస్ (42) అనే హిందూ వ్యక్తిని, అతని సహచరుడు నోమన్ మియా తుపాకీతో కాల్చి చంపాడు. వీరిద్దరూ బంగ్లాదేశ్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని అన్సార్ అనే పారామిలిటరీ దళానికి చెందిన సభ్యులు.

పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం 6:45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఫ్యాక్టరీ ప్రాంగణంలోని అన్సార్ బ్యారక్‌లో ఉన్న సమయంలో నోమన్ మియా, ప్రభుత్వం ఇచ్చిన షాట్‌గన్‌ను బజేంద్ర వైపు సరదాగా (జోక్ చేస్తూ) గురిపెట్టాడు. అయితే అదే సమయంలో తుపాకీ పేలడంతో బుల్లెట్ బజేంద్ర ఎడమ తొడలోకి దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై పెరుగుతున్న హింసకు ఈ ఘటన అద్దం పడుతోంది. డిసెంబర్ 18వ తేదీన భలూకాలోనే దీపు చంద్ర దాస్ అనే వ్యక్తిని దైవదూషణ ఆరోపణలతో గుంపుగా వచ్చి కొట్టి, వివస్త్రను చేసి నిప్పు పెట్టి చంపారు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత మరో హిందూ వ్యక్తిపై దాడి చేసి కొట్టి చంపిన ఘటన మైమన్‌సింగ్ వెలుపల వెలుగు చూసింది. తాజాగా బజేంద్ర బిస్వాస్ కాల్చివేతతో కలిపి కేవలం 14 రోజుల్లో ముగ్గురు హిందువులు ప్రాణాలు కోల్పోయారు.

హిందూ మైనారిటీల రక్షణ కోరుతూ బంగ్లాదేశ్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఢాకా, చిట్టగాంగ్ వంటి నగరాల్లో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి మైనారిటీలకు రక్షణ కల్పించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. భారత్ సహా పలు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఈ దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, బంగ్లాదేశ్ ప్రభుత్వం వీటిని వివిక్త నేరపూరిత చర్యలుగానే అభివర్ణిస్తోంది.