Iran-Israel War : అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం.. మన జేబుకు చిల్లు.. బొక్క మనకే!

Iran-Israel War

Iran-Israel War: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతోంది. అయితే ఇది మనకు చాలా దూరంలో జరుగుతున్నట్లు అనిపించవచ్చు. కానీ, దీని వల్ల మన దేశ ఆర్థిక పరిస్థితిపై, ముఖ్యంగా మన ఇంటి బడ్జెట్‌పై గట్టి దెబ్బ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ మనకు దగ్గరగా ఉండటమే కాకుండా, మనకు అవసరమైన చమురు సరఫరా అయ్యే దారిలో ఉంది.

మన దేశానికి కావాల్సిన ఆయిల్‌లో దాదాపు 85 శాతం మనం వేరే దేశాల నుంచే కొనుక్కుంటాం. యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా ఆగిపోతే, ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. లెక్కల ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయిల్ ధర కేవలం ఒక్క డాలర్ పెరిగినా, మన దేశం అదనంగా 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆయిల్ రేట్లు పెరిగితే ఆటోమేటిక్‌గా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి.

డీజిల్ ధర పెరిగితే లారీలు, వ్యాన్‌ల రవాణా ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల మనం రోజూ వాడే పప్పులు, కూరగాయలు, నూనెలు ఇలా ప్రతి వస్తువు ధర పెరిగిపోయి సామాన్యుడికి భారంగా మారుతుంది.

భారత్ నుంచి ఇరాన్‌కు ప్రతి ఏటా చాలా వస్తువులు వెళ్తాయి. ముఖ్యంగా మన దేశం నుంచి వెళ్లే బాస్మతి బియ్యం కొనే దేశాల్లో ఇరాన్ చాలా ముఖ్యమైంది. యుద్ధం వల్ల ఈ ఎగుమతులు ఆగిపోతే మన దేశ వ్యాపారులకు, రైతులకు నష్టం వాటిల్లుతుంది.

ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి

మనం విదేశాల నుంచి కొనే వస్తువులకు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి రావడంతో, అంతర్జాతీయ మార్కెట్‌లో మన రూపాయి విలువ తగ్గిపోతుంది. దీనివల్ల విదేశీ ప్రయాణాలు, అక్కడ చదువుకునే విద్యార్థుల ఖర్చులు కూడా బాగా పెరిగిపోతాయి. ప్రస్తుతానికి మనం ఇరాన్ నుంచి నేరుగా ఆయిల్ కొనకపోయినా, ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగితే ఆ సెగ మనకు తప్పదు. యుద్ధం ఎంత త్వరగా ముగిస్తే మన దేశానికి అంత మంచిది.