Rinku Singh Rahi : పని ఇవ్వడం లేదని.. ఐఏఎస్ ఆఫీసర్ సంచలన నిర్ణయం!

Rinku Singh Rahi

Rinku Singh Rahi :  ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దళిత ఐఏఎస్ అధికారి రింకూ సింగ్ రాహీ తన పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. తనకు సరైన పని అప్పగించడం లేదని, వ్యవస్థలో తనను పక్కన పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 2022 బ్యాచ్‌కు చెందిన ఈ అధికారి మంగళవారం తన రాజీనామా లేఖను సమర్పించారు.

రింకూ సింగ్ రాహీ గతంలో ముజఫర్‌నగర్ సంక్షేమ శాఖలో అధికారిగా ఉన్నప్పుడు ఒక భారీ కుంభకోణాన్ని బయటపెట్టారు. ఆ సమయంలో అవినీతి తిమింగలాలు ఆయనపై ప్రాణాంతక దాడి చేశాయి. ఏడు బుల్లెట్లు తగిలినా ప్రాణాలతో బయటపడిన ఆయన, పట్టుదలతో చదివి ఐఏఎస్ అధికారి అయ్యారు. అయితే ఐఏఎస్ అయ్యాక కూడా ఆయనకు కష్టాలు తప్పలేదు.

2025 జూలైలో షాజహాన్‌పూర్‌లో జరిగిన ఒక లాయర్ల నిరసన సందర్భంగా ఆయన గుంజీలు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత ప్రభుత్వం ఆయనను రెవెన్యూ బోర్డుకు బదిలీ చేసి, ఎలాంటి బాధ్యతలు లేకుండా ఒక అటాచ్డ్ పోస్టులో ఉంచింది.

తన రాజీనామా గురించి రింకూ సింగ్ రాహీ మాట్లాడుతూ, తనకు జీతం ఇస్తున్నారే తప్ప ప్రజలకు సేవ చేసే అవకాశం మాత్రం ఇవ్వడం లేదని ఆవేదన చెందారు. ఒక అధికారికి పని ఇవ్వకుండా ఖాళీగా కూర్చోబెట్టడం ఆ అధికారిని అవమానించడమేనని ఆయన భావించారు.

ఈ అంశంపై నగీనా ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ స్పందిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఒక దళిత అధికారి వ్యవస్థలో నిర్లక్ష్యానికి గురై ఇలా తప్పుకోవాల్సి రావడం బాధాకరమని, అవినీతిపై పోరాడి బుల్లెట్లు తిన్న వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ రాజీనామా కేవలం ఒక వ్యక్తి నిర్ణయం కాదని, మన పరిపాలనా వ్యవస్థలో ఉన్న లోపాలకు నిదర్శనమని ఆజాద్ పేర్కొన్నారు.