Flight Prices : త్వరలో విదేశీ ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటున్న వారికి విమానయాన సంస్థలు ఒక చేదు వార్తను అందిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణలు ప్రపంచ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీనివల్ల ప్రయాణికులు టికెట్ల కోసం గతంలో కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు.
ఈ గొడవల వల్ల విమాన సంస్థలకు అతి పెద్ద ఖర్చయిన జెట్ ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. యుద్ధానికి ముందు బ్యారెల్‌కు 85 నుండి 90 డాలర్లు ఉన్న ఇంధన ధర, ఇప్పుడు ఏకంగా 150 నుండి 200 డాలర్ల వరకు పెరిగిపోయింది. దీంతో విమాన సంస్థలపై ఆర్థిక భారం విపరీతంగా పెరగడంతో ఆ భారాన్ని ప్రయాణికులపై వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికే క్వాంటాస్ ఎయిర్వేస్, ఎయిర్ న్యూజిలాండ్ వంటి అంతర్జాతీయ సంస్థలు టికెట్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. భారత్‌లో కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ, దేశీయ విమానాలపై ఇంధన సర్ఛార్జీలను పెంచుతున్నట్లు వెల్లడించింది. దీనివల్ల మిడిల్ ఈస్ట్ వెళ్లే వారికి సుమారు 10 డాలర్లు, ఆఫ్రికా మరియు ఆగ్నేయ ఆసియా దేశాలకు వెళ్లే వారికి 20 నుండి 90 డాలర్ల వరకు అదనపు భారం పడనుంది.
ఒకవేళ ఈ ధరలను పెంచకపోతే కొన్ని మార్గాల్లో విమానాలను నడపడం అసాధ్యమని, విమానాలు రద్దు చేయాల్సి వస్తుందని సంస్థ చెబుతోంది. అయితే బడ్జెట్ ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతానికి ధరలను పెంచకపోవడం కాస్త ఊరటనిచ్చే విషయం.
ఇంధన ధరలే కాకుండా, యుద్ధం వల్ల గగనతలం సురక్షితంగా లేకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. ఉదాహరణకు దుబాయ్-ఢిల్లీ విమాన టికెట్ గతంలో 12 నుండి 15 వేల రూపాయలు ఉంటే, ఇప్పుడు అది ఏకంగా 32 నుండి 50 వేల రూపాయలకు చేరుకుంది. క్షిపణి దాడుల భయం ఉండటంతో విమానాలను సురక్షితమైన ఇతర మార్గాల్లో మళ్లిస్తున్నారు.
దీనివల్ల ప్రయాణ సమయం పెరగడంతో పాటు ఇంధనం కూడా ఎక్కువగా ఖర్చవుతోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణా జరిగే హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఉండటం, ఖతార్ గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలపై దాడులు జరగడం వంటివి పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి. ఈ పరిస్థితుల్లో ప్రయాణాలు చేయాలనుకునే వారు వీలైనంత ముందుగా టికెట్లు బుక్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
