Audio Leak : పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైష్-ఏ-మహమ్మద్ (JeM) మరోసారి భారత్ లో ఉగ్రదాడికి తెరలేపింది. ఆ సంస్థ అధిపతి మౌలానా మసూద్ అజార్‌దిగా చెబుతున్న ఒక ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. తమ వద్ద వేల సంఖ్యలో ఆత్మాహుతి బాంబర్లు సిద్ధంగా ఉన్నారని, వారు దాడులకు పాల్పడతారని ఆ వాయిస్ లో వినిపించింది.
ఆ ఆడియోలో అజార్ తన క్యాడర్ బలాన్ని గురించి అతిశయోక్తిగా మాట్లాడారు. “మా వద్ద ఉన్నవారు ఒకరు, ఇద్దరు లేదా వంద మంది కాదు.. కనీసం వెయ్యి మంది కూడా కాదు. వారి అసలు సంఖ్య చెబితే అంతర్జాతీయ మీడియాలో ప్రకంపనలు వస్తాయి” అని పేర్కొన్నారు. ఈ రిక్రూట్‌లు భౌతిక లాభాలు, వీసాలు లేదా వ్యక్తిగత ప్రయోజనాలను కోరుకోరని, కేవలం ‘షహదత్’ (వీరమరణం) మాత్రమే కోరుకుంటారని ఆయన చెప్పుకొచ్చారు.
భారత సైన్యం ఇటీవల పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్‌లో ఉన్న జైష్ ప్రధాన కార్యాలయంపై జరిపిన మెరుపు దాడుల (ఆపరేషన్ సిందూర్) తర్వాత ఈ ఆడియో విడుదల కావడం గమనార్హం. గతేడాది సెప్టెంబర్‌లో జైష్ కమాండర్ ఒకరు మాట్లాడుతూ.. భారత దాడుల్లో అజార్ కుటుంబ సభ్యులు మరణించినట్లు పరోక్షంగా అంగీకరించారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన ఈ దాడుల్లో అజార్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు సహా దాదాపు 10 మంది బంధువులు మరణించినట్లు సమాచారం. ఈ నష్టం నుండి దృష్టి మళ్లించడానికే అజార్ ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
2019 నుంచి మసూద్ అజార్ బహిరంగంగా కనిపించలేదు. ఆ ఏడాది బహవల్‌పూర్‌లోని ఆయన నివాసంపై జరిగిన బాంబు దాడిలో తృటిలో తప్పించుకున్నప్పటి నుండి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారనే దానిపై అనేక ఊహాగానాలు ఉన్నాయి.
ఐక్యరాజ్యసమితి ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రవాది అయిన అజార్, 2016 పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి, 2019 పుల్వామా ఆత్మాహుతి దాడి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి. ప్రస్తుతం ఆయన బహవల్‌పూర్‌కు దూరంగా, పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో తలదాచుకుని ఉండవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.
