MLA Pooja Pal: బిగ్ షాక్.. సీఎంను పొగిడిన ఎమ్మెల్యే సస్పెండ్

MLA Pooja Pal: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విధానాలను ప్రశంసించిన సమాజ్ వాదీ పార్టీ మహిళా ఎమ్మెల్యే పూజా పాల్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆమెను ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ బహిష్కరించారు. సదరు ఎమ్మెల్యేకు ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ ఆమె తన వ్యతిరేక కార్యకలాపాలను ఆపలేదని, దీనివల్ల పార్టీకి గణనీయమైన నష్టం కలిగిందని లేఖలో పేర్కొన్నారు. ఆమెను పార్టీ అన్ని పదవుల నుండి తొలగిస్తున్నామని, ఇకపై ఎస్పీ కార్యక్రమాలు లేదా సమావేశాలకు ఆహ్వానించబోమని కూడా స్పష్టం చేశారు. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో తెలిపారు.

ఇంతకీ ఏం జరిగిందంటే .. యూపీ అసెంబ్లీలో విజన్‌ డాక్యుమెంట్‌ 2047 పై 24 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. అందులో భాగంగా ఎస్పీ ఎమ్మెల్యే పూజా పాల్‌ మాట్లాడుతూ తన భర్త (బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే రాజు పాల్‌) హత్య కేసులో నిందితుడిగా ఉన్న అతీక్‌ అహ్మద్‌ ఆగడాలపై చర్యలు తీసుకున్న యోగి ప్రభుత్వం.. తనతోపాటు అనేక మంది మహిళా బాధితులకు న్యాయం చేసిందన్నారు. అలాంటి నేరగాళ్లపై తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని కొనియాడారు. ఇప్పడు రాష్ట్రం మొత్తం సీఎం వైపే చూస్తోందన్నారు.

2005లో ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో (గతంలో అలహాబాద్) బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) ఎమ్మెల్యే రాజు పాల్ దారుణ హత్యకు గురయ్యారు. పూజా పాల్‌తో వివాహమైన 10 రోజులకే ఆయన హత్యకు గురయ్యారు. రాజు పాల్ హత్య తర్వాత, అతని భార్య పూజా పాల్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో అష్రఫ్‌పై విజయం సాధించారు. 2004లో అప్పటి ఎమ్మెల్యే అయిన గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు అతీక్ అహ్మద్ లోక్‌సభకు ఎన్నిక కావడంతో ప్రయాగ్‌రాజ్ వెస్ట్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఉపఎన్నికల్లో బీఎస్‌పీ అభ్యర్థి రాజు పాల్, అతీక్ అహ్మద్ తమ్ముడు ఖలీద్ అజీమ్ అలియాస్ అష్రఫ్‌ను ఓడించారు. ఈ ఓటమిని జీర్ణించుకోలేక, అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ రాజు పాల్‌ను హత్య చేయడానికి ప్రణాళిక వేసినట్లు ఆరోపణలు వచ్చాయి.