BIG BREAKING : మావోయిస్టులకు ఇది నిజంగా బిగ్ షాక్ అనే చెప్పాలి. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముందు మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయిన సంగతి తెలిసిందే. మల్లోజుల 60 మందికి పైగా కేడర్‌తో సహా లొంగిపోయిన కొన్ని గంటలకే ఊహించని మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్ రూపేశ్ తో పాటుగా 70మంది పార్టీ కేడర్లు గురువారం ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ సమక్షంలో లొంగిపోనున్నారు. అంతేకాకుండా తమ ఆయుధాలను సైతం అప్పగించనున్నారు.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఆశన్న స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప) మండలంలోని నర్సింగాపూర్ గ్రామం. నాలుగు దశాబ్దాల క్రితం పీపుల్స్‌వార్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. వాసుదేవరావు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం వాసుదేవరావు వయసు 60 ఏళ్లు పైనే ఉంటుంది. ఆయన లోంగుబాటుతో దాదాపు 40 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానానికి తెరపడనుంది.
మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు, సిద్ధాంతపరమైన ఘర్షణలు, భద్రతా బలగాల పటిష్టమైన ఆపరేషన్ ఖగార్ వంటి వ్యూహాలు లొంగుబాట్లకు దారితీస్తున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న లొంగుబాటు మరియు పునరావాస విధానం కారణంగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు వస్తున్నారని పోలీసులు వెల్లడించారు.