FASTag : ఫాస్ట్‌ట్యాగ్ వాడేవారికి బిగ్ షాక్.. ఏప్రిల్ 1నుంచి కొత్త రేట్లు!

fasttag

FASTag :  నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 కోసం ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్ ధరలను కొద్దిగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సొంత కార్లు, జీపులు మరియు వ్యాన్లు వాడుకునే వారికి ఈ ధరల పెంపు వర్తిస్తుంది. ఇప్పటి వరకు 3,000 రూపాయలుగా ఉన్న వార్షిక పాస్ ధర, వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుండి 3,075 రూపాయలకు చేరుకోనుంది. అంటే వాహనదారులు అదనంగా 75 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

నిజానికి ఈ వార్షిక పాస్ స్కీమ్ 2025 ఆగస్టు 15న మొదలైంది. హైవేలపై ఎక్కువగా ప్రయాణించే ప్రైవేట్ వాహనదారులకు పదే పదే రీఛార్జ్ చేసుకునే తలనొప్పి లేకుండా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని తెచ్చింది. ఒకసారి ఈ పాస్ తీసుకుంటే ఏడాది పొడవునా దేశంలోని ఏ టోల్ ప్లాజా వద్దనైనా 200 సార్లు ఉచితంగా ప్రయాణించవచ్చు. అక్కడ టోల్ ఫీజు ఎంత ఉన్నా సరే, ఈ పాస్ ఉంటే లెక్కలోకి తీసుకోరు. అయితే ఏడాదిలో 200 సార్ల కంటే ఎక్కువ తిరిగితే మాత్రం మళ్ళీ మామూలుగానే డబ్బులు కట్ అవుతాయి.

ప్రస్తుతం ఈ వార్షిక పాస్ విధానానికి వాహనదారుల నుండి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే సుమారు 50 లక్షల మందికి పైగా ఈ పాస్‌లను వాడుతున్నారు. హైవేలపై తిరిగే ప్రైవేట్ కార్లలో దాదాపు 20 శాతం మంది ఈ వార్షిక పాస్ ద్వారానే టోల్ చెల్లిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మీరు కూడా ఈ పాస్ తీసుకోవాలనుకుంటే ‘రాజమార్గ్‌ యాత్ర’ యాప్ ద్వారా గానీ లేదా హైవే అథారిటీ అధికారిక వెబ్‌సైట్‌లో గానీ మీ మొబైల్ నంబర్ మరియు వాహనం నంబర్ ఇచ్చి సులభంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒక్కసారి పేమెంట్ పూర్తి చేస్తే చాలు, మీ వార్షిక పాస్ వెంటనే యాక్టివేట్ అయిపోతుంది.