Pakistan : నా మొగుడు వదిలేశాడు…మోదీ నువ్వే న్యాయం చేయాలి!

pakistan

Pakistan : తన భర్త తనను వదిలేసి, రహస్యంగా మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడని ఆరోపిస్తూ పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళ భారత ప్రధాని మోదీని  న్యాయం చేయాలని వేడుకుంటూ ఓ భావోద్వేగ వీడియోను విడుదల చేసింది. ఇప్పుడీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పాకిస్తాన్ మూలాలు కలిగి, దీర్ఘకాలిక వీసాపై ఇండోర్‌లో నివసిస్తున్న విక్రమ్ నాగ్దేవ్‌తో నిఖితా నాగ్దేవ్‌కు 2020 జనవరి 26న కరాచీలో హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరిగింది. అయితే పెళ్లయిన నెల రోజులకు అంటే ఫిబ్రవరి 26న విక్రమ్ ఆమెను భారత్‌కు తీసుకువచ్చాడు. దీంతో కొన్ని నెలలకే తన జీవితం తలకిందులైందని నిఖిత ఆరోపించింది.

వీసా సాంకేతిక సమస్య పేరు చెప్పి, 2020 జూలై 9న అటారీ సరిహద్దు వద్ద తనను బలవంతంగా పాకిస్తాన్‌కు పంపించేశాడని నిఖిత తన వీడియోలో చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి విక్రమ్ తనను తిరిగి భారత్‌కు తీసుకురావడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదంది. దీంతో తాను మోసపోయానని.. తనకు న్యాయం చేయాలంటూ ప్రధాని మోదీకి వీడియోలో బాధను చెప్పుకుంటూ వేడుకుంది.

ఈ రోజు నాకు న్యాయం జరగకపోతే, మహిళలు న్యాయంపై విశ్వాసం కోల్పోతారు. చాలా మంది అమ్మాయిలు తమ అత్తమామల ఇళ్లలో శారీరక, మానసిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. దయచేసి నాకు అండగా నిలవాలని అందరినీ కోరుతున్నాను. ప్రతి మహిళకు భారతదేశంలో న్యాయం జరగాలి అని వేడుకుంది.

ఇక తనకు పెళ్లైన తరువాత మరి కొన్ని షాకింగ్ విషయాలను కూడా నిఖితా నాగ్దేవ్‌ ఈ వీడియోలో పంచుకుంది. పాకిస్తాన్ నుంచి అత్తమామల ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, వారి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. నా భర్త నా బంధువులలో ఒకరితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని తెలిసింది. ఇదే విషయాన్ని తన మామగారికి చెప్పినప్పుడు, ‘అబ్బాయిలకు ఇలాంటి వ్యవహారాలు ఉంటాయి, ఏమీ చేయలేము’ అని అన్నారని నిఖిత ఆవేదన వ్యక్తం చేసింది. కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో విక్రమ్ తనను పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లమని బలవంతం చేశాడని చెప్పకొచ్చింది.

తాను ఇంకా చట్టబద్ధంగా విక్రమ్‌కు భార్యగా ఉన్నప్పటికీ, అతను ఢిల్లీకి చెందిన మరొక మహిళతో రెండో వివాహానికి సన్నాహాలు చేస్తున్నాడని తెలుసుకున్న నిఖితా, తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో 2025 జనవరి 27న ఆమె వ్రాతపూర్వక ఫిర్యాదు దాఖలు చేసింది.

ఈ కేసు మధ్యప్రదేశ్ హైకోర్టుచే అధికారం పొందిన సింధీ పంచ్ మధ్యవర్తిత్వ మరియు న్యాయ సలహా కేంద్రం ముందుకు వచ్చింది. విక్రమ్‌కు, అతని కాబోయే ప్రియురాలికి నోటీసులు జారీ చేసి విచారణ నిర్వహించారు. అయితే, మధ్యవర్తిత్వం విఫలమైంది. 2025 ఏప్రిల్ 30 నాటి కేంద్రం నివేదిక ప్రకారం, భార్యాభర్తలిద్దరూ భారత పౌరులు కానందున, ఈ విషయం పాకిస్తాన్ న్యాయ పరిధిలోకి వస్తుందని పేర్కొంది. అయినప్పటికీ, విక్రమ్‌ను పాకిస్తాన్‌కు దేశ బహిష్కరణ చేయాలని ఆ నివేదిక సిఫార్సు చేసింది.

ఇలాంటి కేసు ఇండోర్‌లో వెలుగు చూడటం ఇదే మొదటిసారి కాదు. 2025 మే నెలలో, నిఖితా ఇండోర్ సోషల్ పంచాయితీని ఆశ్రయించగా, ఆ సంస్థ కూడా విక్రమ్‌ను దేశ బహిష్కరణ చేయాలని సిఫార్సు చేసింది. ఈ విషయంపై దర్యాప్తుకు ఆదేశించినట్లు కలెక్టర్ ఆశీష్ సింగ్ తెలిపారు.ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.