ఏం ఖర్మరా దేవుడా..12 గంటలు ఎయిర్పోర్ట్ లోనే.. IndiGo నీకో దండం!

indigo flight

IndiGo : దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగోపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఆపరేషనల్ సమస్యల వల్ల ఇండిగో రికార్డు స్థాయిలో 500కు పైగా విమానాలను రద్దు చేసింది. 12 గంటలకు పైగా తమ లగేజీ కోసం వేచి చూడటం,ఫుడ్, వాటర్ కూడా లేకపోవడం, ఎయిర్‌లైన్స్ కౌంటర్లు ఖాళీగా ఉండటం వంటి కారణాలతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ విమానాశ్రయంలో వేలాది సూట్‌కేసులు టెర్మినల్‌లో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి, ప్రయాణికులు నేలపైనే నిద్రపోతున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కొందరు ప్రయాణికులు ఆగ్రహంతో ఇండిగోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. “12 గంటలకు పైగా ఇక్కడే ఉన్నాం. ప్రతిసారీ ఒక గంట, రెండు గంటలు ఆలస్యం అని చెబుతున్నారు. మాకు లగేజీ కూడా దొరకడం లేదు. ఇండిగో సిబ్బంది ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఇది మానసిక వేధింపు” అని ఒక ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కూడా ఇదే తరహా దృశ్యాలు కనిపించాయి. ప్రయాణికులకు ఆహారం, వసతి కల్పించకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నిరసనను తెలియజేయడానికి కొందరు ప్రయాణికులు ఎయిర్ ఇండియా విమానాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. గోవా, చెన్నై, విశాఖపట్నం, పుణె విమానాశ్రయాల్లోనూ ఇండిగో విమానాల రద్దు, ఆలస్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.