రానున్న 24 గంటల్లో భారత్ పై భారీగా సుంకాలు పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. CNBCతో ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు సరిగా లేవని, భారత్ అమెరికా నుంచి ఎక్కువగా దిగుమతులు చేసుకుంటున్నప్పటికీ, అమెరికా భారత్ నుంచి తక్కువగా దిగుమతులు చేసుకుంటోందని ట్రంప్ ఆరోపించారు.
రష్యా నుంచి భారీగా ముడి చమురును కొనుగోలు చేసి, దానిని శుద్ధి చేసి అధిక లాభాలకు ఇతర దేశాలకు అమ్ముకుంటూ ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ పరోక్షంగా మద్దతు ఇస్తోందని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. ప్రపంచంలోనే భారత్ అత్యధిక సుంకాలు విధిస్తోందని, ఇది అమెరికా ఉత్పత్తుల ఎగుమతులకు అడ్డంకిగా మారిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ఇక ఇప్పటికే భారత్‌పై 25 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇప్పుడు ఈ సుంకాలను మరింతగా పెంచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ పరిణామం భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యాపార నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ విషయాలపై భారత ప్రభుత్వం కూడా స్పందించింది. రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు భారత్‌ను విమర్శించడం అన్యాయమని, అహేతుకమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం వెనుక గల కారణాలను వివరిస్తూ, దేశ అవసరాలను బట్టే భారత్ ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా, అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నాయని భారత్ పేర్కొంది.