Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తప్పిన ప్రమాదం!

Droupadi Murmu

Droupadi Murmu : భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కేరళ పర్యటనలో స్వల్ప అవాంతరం చోటుచేసుకుంది. ఆమె ప్రయాణించిన హెలికాప్టర్ కు ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం పతనంతిట్ట జిల్లాలోని ప్రమదం రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా హెలిప్యాడ్ కుంగిది. దీంతో హెలికాప్టర్ చక్రాలు అక్కడ ఏర్పడిన చిన్న గుంతల్లో చిక్కుకుపోయాయి.

అయితే ఈ సంఘటన జరిగినప్పుడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సురక్షితంగా హెలికాప్టర్ నుంచి దిగిపోయారు. ఆమె పంబకు రోడ్డు మార్గంలో వెళ్లాల్సినందున, ఆమె పర్యటన షెడ్యూల్‌కు ఎలాంటి ఆటంకం కలగలేదు. సంఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, చిక్కుకుపోయిన హెలికాప్టర్‌ను పక్కకు నెట్టి సురక్షిత ప్రాంతానికి తరలించారు.

హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం చివరి క్షణంలో స్టేడియంను నిర్ణయించారని, అందుకే మంగళవారం ఆలస్యంగా అక్కడ హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశామని జిల్లాకు చెందిన సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మొదట పంబా సమీపంలోని నీలక్కల్ వద్ద ల్యాండింగ్ చేయాలని అనుకున్నారు, కానీ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో దానిని ప్రమదం స్టేడియానికి మార్చారని తెలిపారు.

కాంక్రీటు పూర్తిగా గట్టిపడలేదు. అందువల్ల, హెలికాప్టర్ ల్యాండ్ అయినప్పుడు దాని బరువును తట్టుకోలేకపోయింది. దీంతో చక్రాలు నేలను తాకిన చోట లోయలు ఏర్పడ్డాయని అధికారి చెప్పారు. రాష్ట్రపతి పర్యటనలో ఇలాంటి అజాగ్రత్త పట్ల అధికారులు విచారణ చేపట్టే అవకాశం ఉంది.