Bribe : పోలీసుల పరువు తీశాడుపో.. పెద్ద బాసే అసలు దొంగ

bribe

Bribe  : లంచం తీసుకున్నారనే ఆరోపణలపై అరెస్టయిన పంజాబ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DIG)హర్‌చరణ్ సింగ్ భుల్లార్ ఆస్తులు చూసి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అధికారులు నివ్వెరపోయారు. ఆయన ఇంటిపై , ఆఫీసుపై జరిపిన సోదాల్లో సుమారు రూ.5 కోట్ల నగదు, 1.5 కిలోల బంగారం, అనేక లగ్జరీ కార్లు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

రోపర్ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయిన భుల్లార్, తనపై ఉన్న కేసును పరిష్కరించడానికి, తన వ్యాపారంపై పోలీసు చర్యలు తీసుకోకుండా చూసుకోవడానికి ఒక స్క్రాప్ డీలర్ నుండి రూ. 5 లక్షలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అరెస్టు అనంతరం, పంజాబ్, చండీగఢ్‌లలోని ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమ సంపాదనకు సంబంధించిన భారీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

15 కి పైగా ఆస్తులకు సంబంధించిన పత్రాలు, రెండు లగ్జరీ కార్లు, 22 లగ్జరీ వాచ్ లు, అనేక లాకర్ కీలు, 40 లీటర్ల దిగుమతి చేసుకున్న మద్యం, డబుల్ బ్యారెల్ గన్, పిస్టల్, రివాల్వర్, మందుగుండు సామగ్రితో కూడిన ఎయిర్‌గన్‌తో సహా తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మధ్యవర్తి వద్ద రూ.21 లక్షల నగదు దొరికింది. సోదాలు, దర్యాప్తు కొనసాగుతున్నందున నిందితులిద్దరినీ నేడు కోర్టు ముందు హాజరుపరచనున్నారు. పంజాబ్ పోలీస్ శాఖలో ఇంతటి ఉన్నత స్థాయి అధికారి భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడటం, అక్రమాస్తులు బయటపడటం రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ ఘటన పంజాబ్ రాజకీయ, పోలీస్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.

2025 అక్టోబర్ 11న రికార్డ్ చేయబడిన వాట్సాప్ కాల్ ద్వారా భుల్లార్ కిర్షానుకు రూ. 8 లక్షలు వసూలు చేయాలని సూచించినట్లుగా విచారణలో తేలింది. 2007 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన పాటియాలా రేంజ్ డీఐజీగా పనిచేసిన తర్వాత 2024 నవంబర్ 27న రోపర్ రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన విజిలెన్స్ బ్యూరోలో జాయింట్ డైరెక్టర్‌గా, జగ్రాన్, మొహాలి, సంగ్రూర్‌లలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా కూడా పనిచేశారు. ఈయన పంజాబ్ మాజీ డీజీపీ మెహల్ సింగ్ భుల్లార్ కుమారుడు.