Rupali Chakankar : జ్యోతిష్యుడితో అడ్డంగా దొరికిపోయి .. రూపాలీ మరో సంచలనం!

Rupali Chakankar

Rupali Chakankar : అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద జ్యోతిష్యుడు, స్వయం ప్రకటిత బాబా అశోక్ ఖరాత్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో రూపాలీ చకాంకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీ మహారాష్ట్ర మహిళా విభాగం అధ్యక్ష పదవికి ఆమె శుక్రవారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె ఎక్స్ (X) వేదికగా తన రాజీనామాను ప్రకటించారు.

ఎన్సీపీ అధ్యక్షురాలు, డిప్యూటీ సీఎం సునేత్రా పవార్‌తో ఫోన్లో చర్చించిన తర్వాతే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు రూపాలీ తెలిపారు. ఈ వివాదం వెలుగులోకి వచ్చిన వెంటనే ఆమె ఇప్పటికే మహారాష్ట్ర రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

నాసిక్ జిల్లాలోని మీర్‌గావ్‌లో ఒక ఆలయ ట్రస్ట్‌కు అధిపతిగా ఉన్న అశోక్ ఖరాత్‌ను మార్చి 18న పోలీసులు అరెస్ట్ చేశారు. మూడేళ్లుగా తనపై పదేపదే అత్యాచారం చేశాడని ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. ప్రస్తుతం అతనిపై ఇప్పటివరకు 8 ఎఫ్‌ఐఆర్‌లు (FIRs) నమోదయ్యాయి. రూపాలీ చకాంకర్ కూడా ఆ ఆలయ ట్రస్ట్‌లో సభ్యురాలు కావడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.

తన రాజీనామా లేఖలో రూపాలీ స్పందిస్తూ.. “ఖరాత్ చేసిన ఆర్థిక లావాదేవీలతో గానీ, అక్రమ పనులతో గానీ నాకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో నా వైఖరి మొదటి రోజు నుంచే స్పష్టంగా ఉంది. ఆధారాలు లేకుండా మీడియాలో వస్తున్న ఆరోపణలు నన్ను బాధిస్తున్నాయి. విచారణలో నిజం బయటపడుతుంది” అని ఆమె పేర్కొన్నారు. బాబా అశోక్ ఖరాత్‌ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.