కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయంలో జరిగిన బంగారు చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక అడుగు వేసింది. ఈ కేసుకు సంబంధించి ఆలయ ప్రధాన తంత్రి కందరారు రాజీవరును అరెస్ట్ చేశారు.
శబరిమల ఆలయ గర్భాలయంలోని ద్వారపాలకుల విగ్రహాలు, ఇతర చెక్క శిల్పాలకు బంగారు తాపడాలు చేసే విషయంలో అక్రమాలకు పాల్పడ్డారనేది కందరారు రాజీవరుపై ప్రధాన ఆరోపణ.
ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా 1998లో ఆలయానికి 30.3 కిలోల బంగారం, 1,900 కిలోల రాగిని విరాళంగా ఇచ్చారు. అయితే శ్రీకోవిల్ చుట్టూ ఉన్న బంగారు తాపడాల్లో భారీగా బంగారం మాయమైందని, దానికి బదులుగా ఇతర లోహాలను ఉపయోగించారని లేదా దోపిడీ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపేందుకు కేరళ ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది.
ఈ కేసులో మొదటి నిందితుడైన ఉణ్ణి కృష్ణన్ పోట్టికి గర్భాలయం నుండి బంగారు తాపడాలను దొంగిలించడానికి, వాటిని బయటకు తరలించడానికి తంత్రి సహకరించారని దర్యాప్తులో తేలింది.బంగారు తాపడాల చోరీ గురించి తంత్రికి ముందే తెలుసని, ఆయన అనుమతితోనే ఇవన్నీ జరిగాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆలయ నిబంధనల ప్రకారం శబరిమలలో జరిగే ప్రతి పనికి తంత్రి అనుమతి తప్పనిసరి, కాబట్టి ఆయన తెలియకుండా ఇది జరిగే అవకాశం లేదని SIT భావిస్తోంది.
