హెచ్‌-1బీ ఉద్యోగులను నియమించుకోబోం : TCS CEO సంచలనం

TCS

TCS : ఈ ఏడాది హెచ్ -1బీ వీసా కింద కొత్త నియామకాలు చేపట్టబోమని…ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ CEO కృతివాసన్ తెలిపారు. హెచ్ -1బీ వీసా ఫీజును లక్ష డాలర్లుకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వేళ…కృతివాసన్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.

అమెరికాలో 32 వేల నుంచి 33 వేల మంది TCS సిబ్బంది ఉన్నారన్న ఆయన..అందులో దాదాపు 11వేల మంది హెచ్ -1బీ వీసా పైన వచ్చినవారని అన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 500 మందిని హెచ్ -1బీ వీసాలతో భారత్ నుంచి అమెరికాకు పంపించినట్లు చెప్పారు. ప్రస్తుతం హెచ్ -1బీ వీసా ఉద్యోగులపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించాలనుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం స్థానిక ఉద్యోగుల నియామకాలపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.

ఇటీవల టీసీఎస్ లో 2శాతం వరకు ఉద్యోగాల తొలగింపులపై స్పందించిన కృతివాసన్ …కంపెనీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. బాధిత ఉద్యోగులకు మెరుగైన తొలగింపు ప్యాకేజీని అందించినట్లు వెల్లడించారు. ఏఐ డేటా కేంద్రాల్లో దాదాపు 7 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కృతివాసన్ తెలిపారు.

అమెరికాలో హెచ్ -1బీ వీసాల ద్వారా ఉద్యోగులను అత్యధికంగా నియమించుకుంటున్న కంపెనీల జాబితాల్లో టీసీఎస్ మొదటి వరుసలో ఉంది. 2009 నుంచి 2025 మధ్య 98 వేల 259 మందిని ఇలా టీసీఎస్ నియమించుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5,505 మందిని హెచ్ 1 బీ వీసాల ద్వారా TCS తీసుకుంది.