TVK : టికెట్ ఇస్తే కొంపముంచాడు.. విజయ్ పార్టీ అభ్యర్థిపై లైంగిక వేధింపుల కేసు!

tvk

TVK : తమిళనాడు రాజకీయాల్లో సంచలనం నెలకొంది. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ అభ్యర్థిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తిరువళ్లూరు జిల్లాకు చెందిన పూనమల్లి నియోజకవర్గ అభ్యర్థి ప్రకాష్ (కుట్టి) పై ఒక మహిళా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం విజయ్ అభ్యర్థులను ప్రకటించిన కొద్దిరోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

బాధిత మహిళ ఫిర్యాదు ప్రకారం.. సుమారు ఆరు నెలల క్రితం ఒక వివాహ వేడుకలో ఈ వేధింపుల ఘటన జరిగింది. దీనిపై అప్పుడే పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. చివరకు తన భర్తతో కలిసి జిల్లా ఎస్పీని ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ప్రకాష్ తిరువళ్లూరు దక్షిణ జిల్లా కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు.

అయితే, ఈ ఆరోపణలను ప్రకాష్ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రకాష్ భార్య పోలీసులకు ఎదురు ఫిర్యాదు చేస్తూ.. సదరు మహిళకు పార్టీలో పదవి రాకపోవడం వల్లే కావాలనే ఇలాంటి అబద్ధపు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఒకపక్క 2026 ఎన్నికల కోసం విజయ్ ఒంటరి పోరాటానికి సిద్ధమవుతున్న తరుణంలో, అభ్యర్థులపై ఇలాంటి కేసులు రావడం పార్టీకి సవాలుగా మారింది. పోలీసులు ప్రస్తుతం బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసి, లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.