Vijay Assets : ఎన్నికల నామినేషన్.. విజయ్ ఆస్తుల లెక్క తేలింది!

TVK Chief Vijay Assets

Vijay Assets : తమిళ సినీ స్టార్, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ తొలిసారి ఎన్నికల బరిలో నిలుచున్నారు. చెన్నైలోని పెరంబూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సోమవారం ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వెండితెరపై దశాబ్దాల పాటు అలరించిన విజయ్, ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగడం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

విజయ్ సమర్పించిన వివరాల ప్రకారం.. ఆయనకు భారీగానే ఆస్తులు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన దగ్గర ఉన్న చరాస్తుల విలువ అక్షరాలా రూ. 405 కోట్లుగా ఉంది. ఇందులో నగదు, బ్యాంకు డిపాజిట్లు, షేర్లు,  ఆయన దగ్గర ఉన్న ఖరీదైన కార్లు వంటివి ఉన్నాయి. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే.. తన పేరు మీద ఉన్న భూములు, విలాసవంతమైన ఇళ్లు, భవనాల విలువ సుమారు రూ. 115 కోట్లు ఉంటుందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

మొత్తంగా చూస్తే విజయ్ ఆస్తుల విలువ రూ. 520 కోట్లకు పైగానే ఉంది. సినీ రంగంలో తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించిన విజయ్, రాజకీయాల్లోకి వస్తూనే ఇంత భారీ స్థాయిలో ఆస్తులను ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక సామాన్య నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి, నేడు వందల కోట్ల ఆస్తులతో పాటు లక్షలాది మంది అభిమానుల అండతో ఎన్నికల బరిలో నిలవడం తమిళ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.

కాగా భారత ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం, తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఒకటి పెరంబూరు కాగా మరొకటి తిరుచిరాపల్లి ఈస్ట్. విజయ్ తన నామినేషన్ పత్రాలను ‘సి. జోసెఫ్ విజయ్’ అనే పేరుతో దాఖలు చేశారు.