IndiGo : దేవుడా.. కూతురికి బ్లీడింగ్ అవుతుందని ప్యాడ్స్ అడిగితే..!

Indigo

IndiGo :  దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో (IndiGo)లో తలెత్తిన సంక్షోభం ఐదో రోజుకు చేరుకుంది. పైలట్ రోస్టరింగ్‌లో సమస్యలు, సిబ్బంది కొరత కారణంగా ఇండిగో సేవలు దేశవ్యాప్తంగా పూర్తిగా నిలిచిపోయాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరులతో పాటు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. దీంతో ప్రయాణికులు చుక్కలు చూస్తున్నారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న కష్టాలకు అద్దం పడుతూ ఓ హృదయవిదారక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గంటల తరబడి విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ఓ తండ్రి, తన కుమార్తె పట్ల కనీస మానవత్వం చూపాలని ఇండిగో సిబ్బందిని దీనంగా వేడుకున్న దృశ్యం యావత్ దేశాన్ని కదిలించింది.ఆ తండ్రి ఇండిగో సిబ్బంది వద్దకు వెళ్లి కన్నీటితో వేడుకుంటూ… “సిస్టర్, నా కూతురికి బ్లీడింగ్ అవుతోంది. ఆమెకు శానిటరీ ప్యాడ్ కావాలి అంటూ వేడుకున్నాడు… విమానాలు సమయానికి నడవడం లేదు, కనీసం ఈ అత్యవసర పరిస్థితిలోనైనా సహాయం చేయరా?” అంటూ వేడుకున్నాడు.. ఆ తండ్రి వేడుకోలుకు అక్కడున్న ఇండిగో సిబ్బంది నుంచి సరైన స్పందన రాలేదు, తాము ప్యాడ్స్ అందించలేమని చెప్పడంతో ఆయన మరింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఇక శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రావాల్సిన 26 విమానాలు.. ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 43 విమానాలు రద్దు కావడంతో విమానాశ్రయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. తమ విమానాలు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే నిలిచిపోయి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ప్రయాణికులు చెక్‌ ఇన్ అయిన తర్వాత కూడా విమానాన్ని రద్దు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇండిగో నిర్లక్ష్యం కారణంగా తాము నరకం చూస్తున్నామని ఆవేదన చెందారు. పలుచోట్ల ఇండిగో సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు.

ఈ పరిణామాలపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ (DGCA) దృష్టి సారించి, ఇండిగో యాజమాన్యాన్ని వివరణ కోరాయి. ఇండిగో సంస్థ ప్రయాణికులకు రీఫండ్‌లు, రీషెడ్యూలింగ్ సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ, సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్న వేలాది మంది ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం, ఆర్థిక నష్టం తప్పడం లేదు.