23 ఏళ్ల తర్వాత కొత్త ఛాంపియన్

ఇంగ్లాండ్ సాధించింది. 44 ఏళ్ల వరల్డ్ కప్ ప్రస్థానం. మూడుసార్లు ఫైనల్ చేరినా దురదృష్టం వెక్కిరించిన వైనం. క్రికెట్ ను కనిపెట్టిన దేశంలో కప్పు కాలుపెట్టలేదన్న అవమానం. పుట్టింటికి కప్ తీసుకురాలేదన్న వెలితిని తీర్చుకుంది. సగర్వంగా విశ్వకప్ ని ముద్దాడింది. 12వ ప్రపంచకప్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ కప్ సాధించిన ఆరో జట్టుగా చరిత్రకెకింది. 1996 తర్వాత కొత్త ఛాంపియన్ అవతరించడం మళ్లీ ఇప్పుడే.

వరల్డ్ కప్ చరిత్రలో 1975, 79లో వెస్టిండీస్ ఒక్కటే తొలి రెండు విశ్వకప్పులను గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన ప్రతీ మెగా టోర్నీలోనూ కొత్త ఛాంపియన్ అవతరిస్తూ వచ్చింది. 1983లో భారత్, 1987లో ఆస్ట్రేలియా, 1992లో పాకిస్తాన్, 1996లో శ్రీలంక. ప్రతీ టోర్నీలో ఓ కొత్త విజేత గెలిచి వరల్డ్ కప్ మజాని పెంచాయి. అయితే 1999 నుంచి 2007 దాకా హ్యాట్రిక్ వరల్డ్ కప్స్ గెలిచి… ఆస్ట్రేలియా ఏకచ్ఛత్రాధిపత్యం చలాయించింది. దాంతో క్రికెట్ వరల్డ్ కప్ బోరింగ్ గా మారింది. ఎప్పుడూ ఆస్ట్రేలియానే గెలిస్తే ఇక వరల్డ్ కప్ ఎందుకు అన్నంత మొనాటనీ వచ్చేసింది. 2011లో 28 ఏళ్ల తర్వాత భారత్ మళ్లీ విశ్వవిజేతగా ఆవిర్భవించడంతో మిగతా జట్లకు క్రికెట్ కు జీవం పోసింది. అయితే 2015లో మళ్లీ ఆస్ట్రేలియా జగజ్జేతగా నిలవడంతో క్రికెట్ ప్రపంచం నీరుగారిపోయింది. ఆ టోర్నీలో న్యూజిలాండ్ గెలిచి ఉంటే ఆ మజానే వేరుగా ఉండేది. ఈ టోర్నీలో రెండు కొత్త జట్లు ఫైనల్ చేరడంతో కొత్త ఛాంపియన్ అవతరించడం ఖాయమైపోయింది. సొంతగడ్డ మీద లార్డ్స్ వేదికపై కప్పును అందుకోవడం ఇంగ్లాండ్ కల నెరవేరినట్టైంది. అన్నట్టు లార్డ్స్ వేదికగా జరిగిన ఐదో వరల్డ్ కప్ ఇది. గ్రేగ్ ఛాపెల్ తో సహా చాలామంది దిగ్గజాలు టోర్నీ టోర్నీకి కొత్త ఛాంపియన్ అవతరిస్తే తప్ప వరల్డ్ కప్ మజా ఉండదని వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎలా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లాండ్ ఆ లోటు తీర్చింది. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ ఛాంపియన్లుగా ఎప్పుడు అవతరిస్తాయో మరి.

LEAVE A REPLY