Chennai : ప్రేమించి పెళ్లి చేసుకున్న సాఫ్ట్వేర్ దంపతులు, వివాహమైన తొమ్మిది రోజులకే ప్రాణాలు కోల్పోయారు. భార్యను హత్య చేసిన భర్త, ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. ఈ విషాద ఘటన చెన్నై సమీపంలోని కుండ్రత్తూరులో చోటుచేసుకుంది.
విజయ్ (25), యువశ్రీ (24) ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అంబత్తూరులోని ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. అయితే వీరి పెళ్లికి ఇరువైపులా కుటుంబ సభ్యులు నిరాకరించారు. పెద్దల నుంచి వ్యతిరేకత ఎదురైనప్పటికీ, ఈ నెల 13వ తేదీన స్నేహితుల సహకారంతో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత తమ స్వగ్రామాలకు వెళ్లకుండా, కుండ్రత్తూరు సమీపంలోని మూండ్రమ్ కట్టలైలో ఒక అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు.
పెళ్లి జరిగిన కొన్ని రోజుల నుంచే దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. సోమవారం తెల్లవారుజామున ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన విజయ్, నిద్రిస్తున్న యువశ్రీ ముఖంపై దిండును అదిమి పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత, విజయ్ కూడా అదే గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
సోమవారం రోజంతా ఆ ఇల్లు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటం, దంపతులెవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పొరుగువారు తలుపు తట్టారు. లోపలి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వెంటనే కుండ్రత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా.. యువశ్రీ మంచంపై శవమై పడి ఉండగా, విజయ్ ఆమె పక్కనే ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు అక్కడి దిండుపై ఊపిరాడకుండా చేసిన ఆనవాళ్లను గుర్తించారు.
పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాంబరం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. భార్యను చంపి, భర్త ఆత్మహత్య చేసుకున్నాడనే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ, ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కాపురం మొదలుపెట్టిన తొమ్మిది రోజులకే ఇలా విగతజీవులుగా పడి ఉండటం అందరినీ కలిచివేస్తోంది.
