No Cost EMI : నో-కాస్ట్ EMI వెనుక ఇంతుందా? బ్యాంకులు మనల్ని ఎలా బురిడీ కొట్టిస్తున్నాయో తెలుసా!

no cost emi

No -Cost EMI :  ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో గానీ, బయట షాపుల్లో గానీ ఏదైనా ఫోనో, టీవీనో కొనాలంటే మనకు ముందుగా కనిపించే బోర్డు నో-కాస్ట్ EMI (No-Cost EMI). అంటే వడ్డీ లేకుండా నెలనెలా కొంచెం కొంచెం డబ్బులు కట్టుకోవచ్చని దీని అర్థం. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా మనకు నచ్చిన వస్తువు ఇంటికి తెచ్చుకోవచ్చు కదా అని మనం మురిసిపోతాం. కానీ, రూపాయి కూడా లాభం లేకుండా బ్యాంకులు మనకు అప్పు ఎందుకు ఇస్తాయి చెప్పండి. ఇక్కడే అసలు చిక్కుంది. నో-కాస్ట్’ అంటే వడ్డీ లేదని కాదు.. ఆ వడ్డీని మనకు తెలియకుండానే వేరే రూపంలో వసూలు చేస్తారని అర్థం.

సాధారణంగా ఏదైనా వస్తువును మనం ఒకేసారి నగదు ఇచ్చి కొంటే షాపువాడు కొంత డిస్కౌంట్ ఇస్తాడు. ఉదాహరణకు రూ. 50,000 ఫోన్ కొంటే, క్యాష్ కడితే రూ. 5,000 తగ్గిస్తాడు. కానీ మీరు ‘నో-కాస్ట్ EMI’ ఆప్షన్ ఎంచుకోగానే ఆ రూ. 5,000 డిస్కౌంట్ కట్ అయిపోతుంది. ఆ ఐదు వేల రూపాయలనే బ్యాంక్ వడ్డీగా తీసుకుంటుంది. అంటే మీరు అదనంగా వడ్డీ కట్టడం లేదు అనుకుంటున్నారు కానీ, రావాల్సిన డిస్కౌంట్‌ను వదులుకోవడం ద్వారా ఆ మొత్తాన్ని వడ్డీ రూపంలోనే చెల్లిస్తున్నారు.

కంటికి కనిపించని అదనపు బాదుడు

వడ్డీ లేకపోయినా ‘ప్రాసెసింగ్ ఫీజు’ పేరుతో బ్యాంకులు కొన్ని వందల రూపాయలు ముందే లాగేస్తాయి. దీనికి తోడు, వడ్డీ మీద పడే 18 శాతం జీఎస్టీ (GST) అదనం. ఇవన్నీ కలిపితే మీరు వాయిదాల్లో కట్టే మొత్తం, ఆ వస్తువు అసలు ధర కంటే ఎక్కువే ఉంటుంది. ఇక పొరపాటున ఏదైనా నెల వాయిదా కట్టడం ఆలస్యమైతే చాలు.. మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతినడమే కాకుండా, పెనాల్టీల మీద పెనాల్టీలు వేసి చుక్కలు చూపిస్తారు. భవిష్యత్తులో మీరు ఏదైనా పెద్ద లోన్ తీసుకోవాలన్నా ఈ చిన్న EMIలు అడ్డు పడతాయి.

కొనే ముందు ఇది గమనించండి

నో-కాస్ట్ EMI అనేది వస్తువులను అమ్ముకోవడానికి కంపెనీలు వేసే ఒక తెలివైన ఎర మాత్రమే. ఏదైనా కొనే ముందు.. ఒకేసారి నగదు కడితే ఎంత పడుతుంది? EMIలో కడితే మొత్తం ఎంతవుతుంది? ఈ రెండింటి మధ్య తేడా ఎంత ఉందో ఒకసారి లెక్క వేసుకోండి. ఆ తేడా మీకు పెద్దగా అనిపించకపోతేనే EMIకి వెళ్లడం మంచిది. లేదంటే అనవసరంగా బ్యాంకులకు వడ్డీలు కట్టినట్టే అవుతుంది.