బ్రేకింగ్ : నో మోర్ డిస్కషన్స్, సీఎం కేసీఆర్

ఆర్టీసీ సమ్మెపై ట్రాన్స్ పోర్టు అధికారులు, రవాణా మంత్రితో సుధీర్ఘంగా చర్చించిన సీఎం కేసీఆర్.. ఫైనల్ డెసిషన్ కు వచ్చేసినట్టు తెలుస్తోంది. కార్మిక సంఘాలను చర్చలకు పిలిచే ప్రసక్తే లేదని.. యూనియన్లు లేని ఆర్టీసీ కావాలని అధికారులతో సీఎం అన్నట్టు సమాచారం. ఆర్టీసీ నష్టాలకు యూనియన్లే కారణమని… అవి లేకుంటేనే ఆర్టీసీ లాభాల బాట పడుతుందని అన్నారట. నష్టాల్లో ఉన్న సంస్థలో అధికంగా జీతాలు పెంచమని ఏ న్యాయస్థానం చెప్పదని… ఆల్విన్ కంపెనీ నష్టాలతో లాకౌట్ అయితే ఎవరు మాత్రం ఏం చేశారని గతాన్ని గుర్తుచేసినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ మరో ఆల్విన్ కంపెనీలా కాకుండా కాపాడేందుకే కఠిన చర్యలు తీసుకోక తప్పదని అధికారులతో చెప్పినట్టు సమాచారం. ఇపుడున్న పరిస్థితుల్లో కార్మికులు మా ఉద్యోగాలు మాకివ్వమని అడిగినా ఇచ్చే పరిస్థితి లేదని తేల్చిచెప్పినట్టు సమాచారం. కొన్ని యూనియన్లు సమ్మె విరమిస్తం హామీ ఇవ్వండని తన దృష్టికి తీసుకొచ్చినట్టు సీఎం చెప్పారట. ఆర్టీసీ యూనియన్లతో లాలూచీ పడాల్సిన అవసరం లేదని.. ఆర్టీసీ దివాలా తీసే పరిస్థితులను కోర్టు ముందు ఉంచే బాధ్యత అధికారులు తీసుకోవాలని గైడ్ చేసినట్టు చెబుతున్నారు. బుధవారం నుంచి ప్రజారవాణా వ్యవస్థకు సంబంధించి మరిన్ని ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాలని సూచించినట్టు తెలుస్తోంది.