రేవంత్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్

ప్రగతి భవన్ గేటు తాకి తొడగొట్టిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి పోలీసులు షాకిచ్చారు. గేటు టచ్ చేశా… ఇక దొరగడీల్ని బద్ధలు కొట్టడమే అని మీసం మెలేసిన యువనేతపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసును ఫైల్ చేశారు. ప్రగతి భవన్ ముట్టడికి వచ్చే ముందు తన ఇంటి వద్ద మొహరించిన పోలీసులను తోసుకుంటూ బుల్లెట్ దూసుకొచ్చారు రేవంత్. ఆ హడావిడిలో నవీన్ రెడ్డి అనే ఎస్సైకి గాయాలయ్యాయన్నది పోలీసుల వెర్షన్. మిగతా పోలీసులను నెట్టుకుంటూ వెళ్లడతో వాళ్లూ ఇబ్బందులు పడ్డారట. పోలీసుల విధులకు ఆటంకం కల్గించారని, విధి నిర్వహణలో ఉన్న అధికారిని తోసేసి దురుసుగా ప్రవర్తించారన్న కారణాలు చూపించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు పెట్టారు. ఐపీసీ సెక్షన్ 341, 332తో పాటు 353 కింద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.   సోషల్ మీడియాలో రేవంత్ వీడియో వైరల్ గా మారింది. విపరీతంగా సర్క్యులేట్ అయింది. దాన్నే ఎవిడెన్స్ గా చూపించబోతున్నారని టాక్. మొత్తమ్మీద రేవంత్ రెడ్డి దూకుడు కేసీఆర్ ప్రభుత్వానికి అడ్వాంటేజ్ గా మారిందన్నట్టు.