తెల్లారితే కింద…. రాత్రైతే చెట్టు పై… అతనిదో విచిత్ర పరిస్థితి

ఓ వ్యక్తి రాత్రైతే చాలు చెట్టుపైనే నిద్రపోతున్నాడు. అతనే కాదు తన కుమారున్ని కూడా చెట్టుపైకి తీసుకెళ్తున్నాడు. చెట్టుపైన మంచెలాగ తయారు చేసుకుని అక్కడే జీవనం సాగిస్తున్నాడు. ఇదంతా చదువుతుంటే ఏదో ఆనందం కోసం….వింతగా ఉంటుందని చేస్తున్నాడేవో అనిపిస్తుంది కదా. కానీ కాదు. చెట్టుపైకి ఎక్కడంపైన తన ప్రాణాలు దాగి ఉన్నాయి. ఒడిశా కుసుమిత్ర జిల్లా కియోంజర్ ప్రాంతంలో ఉదియ మహకుద్ నివాసం ఉంటున్నాడు. అయితే వీరు ఉంటున్న ప్రాంతం అడవిలో ఉండటం మూలాన జంతువుల బెడద అధికంగా ఉంది. అన్నిటికంటే ఎక్కువ ఏనుగుల బెడదతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్య పది ఏనుగుల గుంపు గ్రామంలో చొరబడి విధ్వంసం చేసి వెళుతున్నాయి. ఇళ్లు, పంటపొలాలను నాశనం చేస్తున్నాయి. ఇప్పటి వరకు చాలా సార్లు వాటి బారీ నుంచి తప్పించుకున్నారు. అయితే ఈ మధ్య ఎప్పటిలాగే మహకుద్ ఇంటిని నాశనం చేశాయి. దీంతో తన ప్రాణాలు తన ఐదేళ్ల కుమారుని ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్టుపై నివాసం ఏర్పరుచుకున్నాడు. రాత్రి పడుకునే ముందు చెట్టు మంచెపై పడుకోని ఉదయం సూర్యుని రాకతో కిందికి దిగుతున్నాడు.

నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని…ఏనుగుల గుంపు తమ గూడు నాశనం చేయడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నానని చెబుతున్నాడు. అటవీ అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్న పట్టించుకోలేదంటున్నాడు మహకుద్. దీంతో ఇలా చెట్టుపై నివాసం ఏర్పరుచుకున్నానని మహకుద్ చెబుతున్నాడు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. ఈ విషయంపై అటవీ శాఖ అధికారులు, ఐటీడీఏ అధికారులు సంప్రదించగా ఏనుగుల గుంపు కనిపెట్టడానికి స్కార్డ్స్ ఏర్పాటు చేశామన్నారు. బాధితుడు మహకుద్ ను ఆదుకుంటామని చెప్పారు. అలాగే అక్కడి ప్రజలకు సాయం చేస్తామని ఫారెస్ట్ అధికారి సంతోష్ జోషి తెలిపారు.

LEAVE A REPLY